కృష్ణయ్యే తెదేపా తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్దా?

 

చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తన పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ఎన్నికలలో విజయం సాధించేందుకు, తమ పార్టీని గెలిపిస్తే బీసీ కులాలకు చెందిన వ్యక్తిని తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత ఆయన బీసీ సంఘాల నేతలతో సమావేశమయినప్పుడు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ఆ వెనువెంటనే బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తన అనుచరులతో కలిసి త్వరలోనే తెదేపాలో చేరబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో చంద్రబాబు కృష్ణయ్యను తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. నిన్న జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆ వార్తలను దృవీకరిస్తున్నట్లే కృష్ణయ్య మాట్లాడటం గమనిస్తే, చంద్రబాబు ఆయననే తమ పార్టీ తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఖరారు చేసి ఉండవచ్చనని నమ్మకం కలుగుతోంది.

 

కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణాలో 60-80 శాతం మంది బీసీలున్నపుడు, తెదేపా ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే దానిని కాంగ్రెస్, తెరాసలు ఎందుకు తప్పుబడుతున్నాయని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ముందు తమ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధుల పేర్లను ప్రకటించి, అప్పుడు తెదేపా గురించి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.

 

రాష్ట్ర విభజనతో తీవ్రంగా దెబ్బతిన్న తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు చంద్రబాబు నాయుడు ఎంచుకొన్న ఈ బీసీ ఎత్తుగడ చాలా మంచి ఫలితాన్నే ఇచ్చే అవకాశాలున్నపటికీ, ఇంతకాలంగా పార్టీనే నమ్ముకొని ఉన్న ఎర్రబెల్లి, రేవూరి, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి వంటి అనేకమంది తెదేపా సీనియర్ నేతలు ఇదే కారణంగా ఆగ్రహం చెందవచ్చును. మరి చంద్రబాబు వారందరినీ కాదని కనీసం ఇంతవరకు పార్టీలో ప్రాధమిక సభ్యత్వం కూడా లేని కృష్ణయ్యకు ఏవిధంగా ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్దపడుతున్నారో, పార్టీలో సీనియర్లను ఏవిధంగా బుజ్జగించగలరో ఊహించడం కష్టమే.

 

సర్వ సాధారణంగా చంద్రబాబు ఏ కీలక నిర్ణయం తీసుకొన్నా అది తాత్కాలిక ప్రయోజనాల కోసం కాక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకొంటారు. వాటిలో చాలా వరకు ఆయన ఆశించిన విధంగానే ఫలితాలు వచ్చాయి. అందువలన ఇప్పుడు కూడా ఆయన కృష్ణయ్య పేరును ప్రతిపాదించి ఉండి ఉంటే, అందుకు తగ్గట్లుగానే ఆయన పార్టీ నేతలను ముందుగానే సన్నధం చేసే ఉండి ఉండవచ్చునని అనుకోకతప్పదు.

Related Segment News