కొత్త పార్టీలు తెదేపాతో సహకరించాలి: బాబు

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పవన్, కిరణ్ కొత్త పార్టీల గురించి నిన్న ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ఆపుతానని ప్రగల్భాలు పలుకుతూ, అంతా అయిపోయిన తరువాత చేతులెత్తేసారు. ఇప్పుడు మళ్ళీ ప్రజలను ఉద్దరిస్తానంటూ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఏమీ చేయలేనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చి ఏమి చేయగలరు ఓట్లను చీల్చడం తప్ప? మహా అయితే ఆయనకు ఒక నాలుగయిదు సీట్లు వస్తాయేమో? కొత్తగా వస్తున్న పార్టీలకు ఓట్లు వేయడం వలన విలువయిన ప్రజల ఓట్లు వృధా అయిపోవచ్చును. కొత్త పార్టీలు పెట్టి ప్రజలలో సదిగ్ధం సృష్టించడం కంటే, వారు తేదేపాకు సహకరించినట్లయితే అందరూ కలిసి రాష్ట్ర పునర్మిర్మాణం చేసుకోవచ్చును,” అని అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, తమతో చేతులు కలిపి సహకరించితే బాగుటుందని సూచిస్తున్నట్లే భావించవచ్చును.

 

పవన్ కళ్యాణ్ కూడా తెదేపాతో చేతులు కలిపేందుకు సానుకూలంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తనకు కనీసం 15 యం.ఎల్యే. మరియు 3-4 యంపీ టికెట్స్ కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లయితే తెదేపాలో చేరడమో లేక ఆపార్టీకి మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే, తెదేపా నేటికీ బీజేపీతో ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తోంది. కనుక, కొన్ని టికెట్స్ పవన్ కళ్యాణ్ కి, మరికొన్ని బీజేపీకి, మరికొన్ని కాంగ్రెస్ నుండి తరలి వస్తున్న నేతలకీ పంచుకొంటూ పోతే ఇక తెదేపాలో ఉన్నవారికెవరికీ టికెట్స్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చును. అందువల్ల మహా అయితే 4-5 సీట్లు కేటాయించేందుకు మాత్రం చంద్రబాబు అంగీకరించగలరు. కానీ, పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఏర్పాటుకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పొట్లూరి వరప్రసాద్ విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని చాలా పట్టుదలగా ఉన్నందున, ఆయనకు విజయవాడ టికెట్ ఇవ్వాలని పవన్ పట్టుబడితే, తెదేపా ఇవ్వలేదు. కనుక పవన్ తెదేపాతో జత కట్టడం కూడా సాధ్యం కాకపోవచ్చును.

 

ఏమయినప్పటికీ, కిరణ్, పవన్ కళ్యాణ్ ల రంగప్రవేశంతో సీమాంధ్రలో రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం. ఈ పాత, కొత్త పార్టీల ప్రభావంతో ప్రజల ఓట్లు చీలడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడటం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే పరితపించిపోతున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, తమవల్లనే ఓట్లు చీలి, ఎవరికీ మెజార్టీ రాకుండా చేసుకొని, రాజకీయ అస్థిరతను సృష్టించడానికి సిద్దపడుతుండటం చాలా శోచనీయం. ఇప్పటికే చాల దయనీయమయిన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం, ఈ రాజకీయ నేతల, పార్టీల స్వార్ధం, అధికార కాంక్ష కారణంగా ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఒక సుస్థిరమయిన ప్రభుత్వం ఏర్పడలేకపోతే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయం. ఈ సంగతి గ్రహించిన చంద్రబాబు అందుకే ఇటువంటి సూచన చేసారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడదని ఆయనకీ తెలుసు.

 

రాజకీయ పార్టీలు వాటిని నడిపే నేతల మధ్య సత్సంబంధాలు, సరయిన అవగాహన, రాష్ట్ర ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే, కాంగ్రెస్ అధిష్టానం ఇంత సాహసించగలిగేదే కాదు. రాష్ట్రానికి నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదు. అందువల్ల ఇప్పుడు వారి నుండి కొత్తగా ఏమీ ఆశించలేము.