జగన్ అన్నయ్య వదిలేసిన బాణం

 

అక్రమాస్తుల కేసులలో జగన్ జైలుకు వెళ్ళిన సమయంలో పార్టీని జనంలో లైవ్ గా ఉంచేందుకు లోటస్పాండ్ బ్యాచ్ అద్బుతమైన ఐడియాతో ముందుకు వచ్చింది. "జగన్ అన్న వదిలిన బాణం ట్యాగ్ లైన్" తో సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం యాత్రను ప్రారంభించారు. తమ పార్టీ లక్ష్యం కోసం 'జే-గ్యాంగ్' తలపెట్టిన యాత్రను ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. మరో ప్రజా ప్రస్థానం యాత్రతో వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. జగన్ జైల్లో ఉన్నా.. పార్టీ బలోపేతానికి కృషి చేసింది.

 

బెయిల్ వచ్చింది .. మడమ తిప్పాడు..

 

జైలు నుంచి జగన్ అన్నయ్య బయటి రావడంతోనే చెల్లెమ్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమైంది. తనకంటే ఎక్కువ సోదరికే ఫాలోయింగ్ ఉందని తెలుసుకున్న అన్నయ్య లక్ష్మణరేఖ గీసాడని .. వైఎస్ అభిమానులు గుసగుసలాడుకుంటు న్నారు. పాదయాత్ర ద్వారా తాను చేసిన కృషికి మెచ్చి పార్టీలో కీలక బాధ్యతలతో పాటు, తను ఆశిస్తున్న టికెట్ కూడా జగనన్న ఇస్తాడని ఆశించిందట. సీట్లన్నింటికీ ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకున్న జగన్.. సోదరికి సారీ చెప్పి మరోసారి చూద్దాం అన్నాడట.. అలిగిన చెల్లెమ్మ పార్టీ కార్యక్రమాలకు దూరమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేమీ కాదు.. తనను ఓవర్ టేక్ చేస్తుందనే భయంతో జగన్ చెల్లెలిని దూరం పెట్టారని చెవులు కొరుక్కుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. మరో ప్రజా ప్రస్థానానికి జగన్ అన్నయ్య వదిలిన బాణం కాస్తా .. జైలు నుంచి రిలీజయ్యాక జగన్ అన్నయ్య వదిలేసిన బాణంలా అయిపోయిందని సెటైర్లు వినపడుతున్నాయి. కడప జిల్లా అభ్యర్ధుల జాబితాను జగన్ ప్రకటించేశారు. అందులో షర్మిల పేరు లేదు. జేసీ దివాకర్ రెడ్డి ఆరోపణలు వాస్తమైతే తరువాత జాబితాలో కూడా చెల్లెలికి సీటు దక్కక పొవచ్చు.