బెడ్ రూము రాజకీయలేల బాబు?

 

ఒకప్పుడు పార్టీలపరంగా మాత్రమే విమర్శించుకొనే స్థాయి నుండి నేడు వ్యక్తిగత దూషణల స్థాయికి మన రాజకీయాలు దిగజారిపోయినందుకు మనం నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది. షర్మిలకి అసలు గాయమూ లేదు, ఆపరేషనూ జరుగలేదంటూ మొదలయిన విమర్శలు, ఇప్పడు ఒకరి కాళ్ళు మరొకరు పట్టుకోవడం, ఒకరి బెడ్ రూమ్ కబుర్లు మరొకరు మాట్లాడటం వరకు దిగజారిపోయాయి.

 

నల్గొండలో పర్యటిస్తున్న షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన చంద్రబాబు, తన స్థాయిని మరిచి మాపై విమర్శలు చేస్తున్నారు. మా ఇంట్లో 70 బెడ్ రూములు కట్టుకోన్నామని ఆయన ప్రజలకి చెపుతున్నారు. మా ఇంట్లో మేము ఎన్ని బెడ్ రూములు కట్టుకొంటే దానితో ఆయనకి ఏమి సబంధం? అయినా అదేమయినా జాతీయ సమస్యా ఉపన్యాసాలలో మాట్లాడటానికి? మా ఇంట్లో ఎన్నిబెడ్ రూములు ఉన్నాయో తెలుసుకోవాలని ఆయనకి అంతగా ఆసక్తి ఉంటే, టవున్ ప్లానింగ్ అధికారుల దగ్గిరకి వెళ్తే అక్కడ మా ఇంటి తాలూకు డ్రాయింగులు చూసుకోవచ్చును."

 

"తెలుగు దేశం పార్టీలో ఒక నేతకి నా కాళ్ళకి దెబ్బ తగిలిందా లేదా? అని అనుమానం, మరో నేతకి అసలు నాకాలికి ఆపరేషను జరిగిందా లేదా అని అనుమానం. వారి నాయకుడికి మా ఇంట్లో బెడ్ రూములెన్ని అని అనుమానం. వీరికి ఇంతకన్నా మాట్లాడేందుకు మరే అంశం దొరకదా? అయినా ప్రతీ చిన్న విషయాన్నీ కూడా రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ప్రయత్నించడం చాల హేయమయిన పని,” అని అన్నారు.

 

దీనికి చంద్రబాబు ఆయన పార్టీ ధీటుగానే సమాధానం చెప్పవచ్చును. గానీ, అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారని ఆలోచిస్తే, ఒక ఆశ్చర్యకరమయిన విషయం బయటపడుతుంది. అది మన సినీపరిశ్రమ, మీడియా చాల కాలంగా అనుసరిస్తున్నసూత్రాన్ని వారు అమలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

ప్రజలకి ఆసక్తి కలిగించే అంశాలను ప్రస్తావించడం, మాస్ మసాల అంశాలు జోడించిన ప్రసంగాలతో ప్రజలకి అవసరమయిన ‘కిక్కు’ అందించడం, మరి కొంత దిగజారి ఎదుట వారి బలహీనతలను బట్ట బయలు చేసి ప్రజలను రంజింపజేసి వారి చేత చప్పట్లు కొట్టించుకోవడం, ‘కిక్కు’ ఇచ్చే ప్రసంగాలుంటాయనే నమ్మకం ప్రజలకు కల్పించి, తద్వారా వారిని సభలకు రప్పించుకోవడం వంటి కొత్త (పాత) సూత్రాలతో నేడు మన రాజకీయ నాయకులు నోటికొచ్చిన మాటలతో ఎదుటవారిని దూషిస్తూ ప్రజలకి వినోదంపంచి ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల తాత్కాలికంగా జనం చప్పట్లు పడినా, అవి ఓట్ల రూపంలో ఎంతమేరకు మారగలవని వారు ఆలోచించుకోవాలి.

 

అయితే, ఇక్కడ కూడా వారు మరో సూత్రం అమలు చేస్తున్నారు. ఒక అబద్దాన్ని నిజం చేయాలంటే, అది అబద్దం కాదు నూటికి నూరు శాతం నిజమేనని వారు స్వయంగా ఆత్మవంచన చేసుకొని నమ్మడమే కాకుండా, అదే విషయాన్ని తమ సభల్లో, సమావేశాల్లో పదేపదే గట్టిగా చెప్పడం ద్వారా క్రమంగా ప్రజలను అబద్దాన్ని నిజం అని నమ్మే స్థాయికి తీసుకు రావచ్చుననే ఆలోచనతో మన రాజకీయ నాయకులు ప్రజలను వంచిస్తున్నారు.

 

ఇంకా, నిర్లజ్జగా చెప్పుకొంటే ప్రజలలో చాలా మంది కుల, మతం, ప్రాంతం ప్రభావాలలో ఉన్నందునే, వారి ఆటలు కొనసాగుతున్నాయి. తాము ఏ ప్రభావానికి లొంగి ఉంటే, దానికి సంబందించిన వ్యక్తులు చెపుతున్నవి అన్నీ కూడా నిజమేనని గుడ్డిగానమ్మే పరిస్థితులు ఇప్పుడు దేశమంతటా కనబడుతున్నాయి.

 

తమ ఉన్నత చదువులు, తమ లోకజ్ఞానం, తమ మేధస్సు వంటివేవీ కూడా, అటువంటి నాయకుల మాటలను, పార్టీలను ప్రశ్నించే వివేకం కలిగించకపోవడం మరో దౌర్భాగ్యం అని చెప్పక తప్పదు. ప్రజలలో ఉన్న ఈ బలహీనతలే రాజకీయ నాయకులకి అలుసుగా మారాయని చెప్పవచ్చును.