చంద్రబాబు తెలంగానం!
posted on Sep 10, 2012 3:36PM

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విషయంలో చంద్రబాబు కాస్త దూకుడుగానే ముందుకెళ్తున్నారు. తెలంగాణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని తెలంగాణ టిడిపి నేతలు చంద్రబాబుకి గట్టిగా లెసన్ తీసుకున్నాక ఆయన ధోరణిలో కాస్త దూకుడుతనం బైటపడుతోంది. దీంతో పార్టీకి చెందిన సీమాంధ్రనేతల గుండెల్లో గుబులు బయలుదేరింది. తెలంగాణ విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై నిర్ణయం తీసుకోవడానికి ముందు చంద్రబాబు సీమాంధ్ర నేతలతోకూడా భేటీ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో అనుకూల వైఖరివల్ల ఏం లాభాలున్నాయో, ప్రతికూల వైఖరివల్ల ఏం లాభాలున్నాయో చంద్రబాబుకి వివరించే ప్రయత్నం చేశారు సీమాంధ్ర నేతలు. మొత్తానికి పార్టీ అధ్యక్షుడిగా బాబు ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ అది తమకు ప్రతికూలంగానే ఉన్నా బాబు చెప్పిన మాటకి తుచతప్పకుండా కట్టుబడి ఉంటామన్న నిర్ణయాన్ని మాత్రం సీమాంధ్ర నేతలు గట్టిగానే వ్యక్తం చేస్తున్నారు.