కెసిఆర్ కూతురు కవిత అరెస్ట్..అసెంబ్లీలో కలకలం

 

 

 Chalo Assembly march kavita arrest, telangana Chalo Assembly march

 

 

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితతో పాటు..పలువురు తెరాస నేతలను కార్యకర్తలను పోలీసులు లోయర్ ట్యాంక్ బాండ్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ సంధర్బంగా కవిత మాట్లాడుతూ..శా౦తియుతంగా అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన తమను అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. తెరాస కార్యకర్తలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

మరోవైపు రవీంద్ర భారతి నుండి తెరాస ఎమ్మెల్యేలు పలువురు అసెంబ్లీ వైపుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఎంపీలు వివేక్, మంద జగన్నాథం, నేతలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ ఎమ్మెల్యేలు గేట్ నెంబర్ 1 వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై పడుకొని మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కిరణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.


అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కలకలం రేపారు. ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, కావేటి సమ్మయ్యలు ఈరోజు ఉదయం అసెంబ్లీ భవనంలోని  టీఆర్ఎస్ఎల్పీ భవనం పైకి ఎక్కారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలని, అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు తమ వద్దకు వస్తే తాము భవనంపై నుండి దూకుతామని వారు హెచ్చరించారు. పోలీసులు వారిని దించే ప్రయత్నాలు చేస్తున్నారు.