చిదంబరం చీటీ చిరగనుందా?

 

స్కాముల్లో ఇరుక్కున్న యుపీఏ మంత్రుల చీటీలు ఒక్కొక్కటే చిరగబోతున్నాయి. నిన్నగాక మొన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ని కూడా బొగ్గు కుంభకోణంలో విచారించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ వరుసలో ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా చేరారు. ఎయిర్‌సెల్‌ -మాక్సిస్‌ డీల్‌ కేసులో చిదంబరం వాంగ్మూలాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) నమోదు చేసింది. 2006లో 3,500 కోట్ల ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ డీల్‌కు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు (ఎఫ్‌ఐపిబి) క్లియరెన్స్‌ ఇప్పించటంలో గౌరవనీయులైన చిదంబరం గారి హ్యాండు వున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. ఈ ఒప్పందంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పెట్టుబడుల పరిమితి 600 కోట్ల రూపాయల వరకు మాత్రమే మంజూరు చేయాల్సి ఉండగా మంత్రిత్వ శాఖ మాత్రం పరిమితికి మించి అనుమతులిచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి.