డాక్టర్ సుధాకర్ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ.. విశాఖ పోలీసులు పై ఎఫ్ఐఆర్ నమోదు

డాక్టర్ సుధాకర్ కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కేసును సీబీఐకి అప్పగిస్తూ డాక్టర్ సుధాకర్‌ తో దురుసుగా ప్రవర్తించిన పోలీస్ లపై కేసు నమోదు చేయడంతో పాటు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ అధికారులు శుక్రవారం పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. సీబీఐ విశాఖ ఎస్పీ పుట్టా విమలాదిత్య పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐదవ అడిషనల్ సివిల్ జడ్జి మరియు విశాఖ ఐదవ అడిషనల్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్‌లకు డాక్టర్ సుధాకర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ కేసులు నమోదయ్యాయి. డాక్టర్‌ సుధాకర్‌ అభియోగాల మేరకు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖ సీబీఐ ఎస్పీ కేసు నమోదు చేశారు.

మరోవైపు, డాక్టర్ సుధాకర్ చికిత్స పొందుతున్న విశాఖ మానసిక వైద్యశాలకు సీబీఐ అధికారులు చేరుకొని, సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన అంశాలు, తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు.