అరెస్టులతో భయపెట్టి యువగళాన్ని ఆపలేరు..లోకేష్

నాలుగేళ్ల పాలనలో జనం మెచ్చే ఒక్క పనీ చేయలేకపోయిన ముఖ్యమంత్రి జగన్.. వారు తనకు మరో చాన్స్ ఇవ్వరన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. మరి ఇప్పుడు వారి అవసరం లేకుండానే అధికారంలోకి రావడానికి అడ్డదారులు వెతుకుతున్నారు. జనం ఎవరినైతే మెచ్చి ఎవరి పర్యటనలకైతే తండోపతండాలుగా వచ్చి మద్దతు తెలుపుతున్నారో వారిని కదలకుండా చేస్తే సగం గెలిచేసినట్లేనన్న భ్రమల్లో ఉన్నారు. అందుకే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేయించారు.

ఏపీ సీఐడీ ఈ నాలుగేళ్లుగా జగన్ సొంత సంస్థగా మారి ఆయన ఏం చెబితే అది చేయడమే తన కర్తవ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ అడ్డగోలుగా  నిబంధనలను తుంగలో తొక్కి నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసింది. ఇక ఇప్పుడు యువగళం పాదయాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్న లోకేష్ నూ కటకటాల వెనక్కు నెట్టేందుకు చర్యలు ఆరంభించింది. అసలు జరగని పనికి, నిధులే వ్యయం కాని పనిలో అవినీతి జరిగిందంటూ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసంటూ ఒకదానిని తెరపైకి తీసుకువచ్చి.. ఆ కేసులో నారా లోకేష్ ను ఏ14గా చేర్చింది. చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా  ఆగిన లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన అరెస్టునకూ రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ14గా చేర్చి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటున్నారు

కానీ... వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక మాత్రమే. ఇందు కోసం సెంటు భూమిని సేకరించలేదు. సమీకరించలేదు. ఇందు కోసం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదు. అయినా ప్రణాళిక రూపొందించడమే మహా నేరమన్నట్లుగా కేసు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏ1గా, అప్పటి మంత్రి నారాయణను ఏ2గా చేర్చారు. ఇప్పుడు నారా లోకేష్ ను ఏ14గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ2 నారాయణ, మరి కొందరు కోర్టును ఆశ్రయించి బెయిలు పొందారు. అయితే నారా చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ బెయిలు పిటిషన్ కూడా ధాఖలు చేయలేదు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనపై ఏసీబీ కోర్టులో పిటి వారంట్ దాఖలు చేశాక, చంద్రబాబు ఈ కేసులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. 

సరే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ తనను ఏ14గా చేర్చడంపై స్పందించారు. ఓటమి భయంతో గజగజలాడుతున్న జగన్.. ప్రత్యర్థులందరినీ నిర్బంధించి.. ప్రజలను భయం గుప్పెట్టోని నెట్టేసి ఏదో విధంగా విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టగలన్న భ్రమల్లో ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజాగ్రహం ఉప్పెనలా ఎగసిపడుతోందని, అందులో జగన్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి, విపక్షాలను నిర్బంధించి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులను సృష్టించిన జగన్ కు ప్రజా కోర్టులో ఓటమి శిక్ష ఇప్పటికే ఖరారైందని లోకేష్ అన్నారు. 
తనను అరెస్టు చేసి యువగళాన్ని ఆపాలన్న జగన్ ప్రయత్నం ఫలించదన్నారు. జీవో 1 తీసుకువచ్చినా ఆగని యువగళం ఇప్పుడు సీఐడీ ఉడత ఊపులకు బెదురుతుందనుకోవడం భ్రమేనని పేర్కొన్నారు.    ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందని, తన యాత్ర ఇచ్ఛాపురం వరకు సాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.   

ఇక లోకేష్ ను ఏ14గా చేర్చిన ఇన్నర్ రింగు రోడ్డు కేసు విషయానికి వస్తే.. ఇన్నర్ రింగు రోడ్డు కోసం ఒక్క రూపాయి కూడా వ్యయం జరగలేదు. అటువంటి ఈ కేసులో ప్రజాధనం దుర్వినియోగం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని పరిశీలకులు అంటున్నారు.  రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చి.. అస్మదీయులకు లాభం చేకూర్చరన్నది సీఐడీ అభియోగం.  అయితే అసలు ఇన్న రింగ్ రింగ్ అలైన్ మెంట్  ఖరారే కానప్పుడు అస్మదీయులకైనా, మరెవరికైనా ఎలాంటి ప్రయోజనం, లాభం సిద్ధించే అవకాశమే లేదు.  అలాంటి వ్యవహారంలో కేసు నమోదు చేసి అరెస్టులకు రంగం సిద్ధం చేయడమంటే జగన్ సర్కార్ ఎంతగా బరితెగించేసిందో అర్థమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఈ కేసు ఎందుకు నమోదు చేశారంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారని సీఐడీ చెబుతోంది.  జగన్ సర్కార్ తీరుతో ఇప్పటికే ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లింది.  ఇక వైసీపీ నేతలు బాహాటంగా చంద్రబాబుని అరెస్టు చేశాం. లోకేష్ నూ వదలం.. అచ్చెన్నాయుడు.. ఇంకా ఎవరైనా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తితే వారినీ అరెస్టు చేసేస్తాం అంటే బాహాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారంటే.. ఎందగా బరితెగించారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.

 అయినా అరాచకత్వం, అహంభావం, నియంతృత్వ ధోరణి జనం భయపడినంత కాలమే సాగుతాయనీ, చంద్రబాబు అరెస్టు అనంతరం వెల్లువెత్తుతున్న ఆందోళనలు, ఆగ్రహ జ్వాలలూ చూస్తుంటే జనం భయం వదిలేశారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ను ఓటు ఆయుధంతో శిక్షించేందుకు జనం సిద్ధంగా ఉన్నారనీ, ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు చంద్రబాబుకు పట్టం గట్టి జగన్ ను ఇంటికి సాగనంపేందుకు ఎదురు చూస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News