జగన్‌కి, రేణుకకి ఎక్కడ చెడింది..?

ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం నిజమైంది. వైసీపీ మహిళా నేత, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఒకటి, రెండు రోజుల్లో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత ఆమెను ఆపేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి స్వయంగా జగన్ ఫోన్ చేసి మాట్లాడినా రేణుక మనసు మార్చుకోలేదని టాక్.. పార్టీని వీడవద్దని, భవిష్యత్ వైసీపీదేనని అధినేత చెప్పినప్పటికీ.. తాను నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆమె జగన్‌తో స్పష్టంగా చెప్పారట.

 

రాజకీయాల్లో ఫిరాయింపులు జరగడానికి సవాలక్ష కారణాలు. డబ్బు కావొచ్చు, కేసుల భయం కావొచ్చు, ఇతరత్రా పనులు కావొచ్చు, స్వప్రయోజనాలో.. ఇంకేవో ప్రలోభాలు కావొచ్చు. అన్ని కలిపి జంపింగ్‌లకు కారణాలుగా మారుతున్నాయి. బుట్టా రేణుక సంగతి చూస్తే.. 2019 ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ టికెట్ తనకే ఇవ్వాలని రేణుక వైసీపీ అధినేతను జిల్లా నేతల సమక్షంలోనే అడిగారు. దీనికి ఆయన నుంచి స్పష్టమైన హామీ రాలేదు.

 

దానికి తోడు ఎంపీగా కాకుండా ఎమ్మిగనూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉంటుందని చెప్పారట జగన్. అధికారంలోకి వస్తే మంత్రి పదవితో కూడా కన్ఫార్మ్ అన్నారట. కానీ లోక్‌సభకు వెళ్లడానికే మొగ్గుచూపుతున్న రేణుక టీకెట్ లభించని పక్షంలో పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ పరిస్థితులను ఒక కంట కనిపెడుతున్న టీడీపీ అధిష్టానం బుట్టాను సైకిల్ ఎక్కించేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీలో చేరితే కర్నూలు టికెట్ తిరిగి మీకే ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. దీనిపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రేణుక తెలుగుదేశం నేతలతో అన్నారట. మరి ఆమె టీడీపీలో చేరతారా..? లేక జగన్ బుజ్జగింపులకు మెత్తబడతారా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.