బ్రదర్ అనిల్ తో వర్మ రహస్య భేటీ మర్మం ఏంటి?

 

తన చిత్రాలకన్నా సంచలనాత్మక వ్యాఖ్యలతోనే రామ్ గోపాల్ వర్మ పాపులర్ అయ్యాడు. ఒక సినిమాని ప్రచారం చెయ్యాలి అంటే వర్మ తర్వాతే ఇంకెవరయినా అని చెప్పొచ్చు. కొందరు సినిమాలో గొప్పదనం వివరించి బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, కంటెంట్ ఎలా ఉన్నా దాన్ని ఏదో రకంగా వివాదాస్పదం చేసి మరీ జనాల్లోకి తీసుకెళ్లడం వర్మకి మాత్రమే తెలిసిన విద్య. తన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా జనం పట్టించుకోవడం మానేసిన తరుణంలో, వర్మ కొత్త మార్గం ఎంచుకున్నాడు.

 

అసలు, లక్ష్మి పార్వతి కోణంలో ఎన్టీఆర్ సినిమా తీస్తానని చెప్పడమే అతి పెద్ద సాహసమయితే, జనాల్లో మరింత ఆసక్తి పెంచేందుకు ఎవరో ఒకర్ని ఇందులోకి లాగి లెఫ్ట్, రైట్ ఇచ్చి వదిలేస్తున్నాడు. వైస్సార్ కాంగ్రెస్ నేత రాకేష్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తుండడం ఒక చర్చనీయాంశం అయితే, తాను నిజాలు నిర్భయంగా చెబుతాను అనడం కొందరికి మింగుడు పడని వ్యవహారంగా మారింది.

 

ఇక తాజాగా, వర్మ వైసీపీ అధినేత జగన్ కు స్వయానా బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ తో రహస్యంగా భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద దుమారమే లేపుతుంది. అయితే, వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి బ్రదర్ అనిల్ తో చర్చించాడా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు కానీ అనిల్ తాను సిద్ధం చేసుకున్న తమసోమా జ్యోతిర్గమయా కథతో సినిమా తీద్దామని వర్మతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

బ్రదర్ అనిల్ కుమార్ నిర్మించనున్న తమసోమా జ్యోతిర్గమయా అనే సినిమా ద్వారా జగన్ హిందువులకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని వినికిడి. ఈ మధ్యే చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న జగన్, తాను హిందూ వ్యతిరేకిని కాదనే సందేశం ఇవ్వడంతో పాటు, 2019 లో జరగబోయే ఎన్నికలకి అన్ని వర్గాల్ని కలుపుకుపోయే ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లుగా అగుపిస్తుంది. అయితే ఎన్ని చేసినా ప్రజలకి మెచ్చే విధంగా తానేం చేయబోతున్నాడో చెప్పగలిగినపుడే జగన్, ఇప్పటికే కొట్టలేనంత బలంగా కనిపిస్తున్న టీడీపీ కి తగిన పోటీ ఇవ్వగలడు, లేదంటే అంతే సంగతులు!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu