చార్జీల మోత మోగించిన త్రివేది బడ్జెట్
posted on Mar 15, 2012 11:56AM
న్యూఢి
ల్లీ: రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఈ ఏడాది కూడా అన్యాయమే! రైల్వే మంత్రి దినేష్ త్రివేది బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారిగా అన్ని తరగతుల ప్రయాణికుల చార్జీలను స్వల్పంగా పెంచారు. ‘స్లీపర్ క్లాసు ప్రయాణికులనుంచి కిలోమీటరుకు కేవలం 5 పైసలు మాత్రమే అడుగుతున్నాను. ఎసి చైర్‌కార్, త్రీ టైర్‌లలో కిలోమీటరుకు పది పైసలు, ఎసి టూటైర్‌లో కిలోమీటరుకు 15 పైసలు, ఎసి ఫస్ట్‌క్లాస్‌లో కిలోమీటరుకు 30 పైసలు మాత్రమే పెంచుతున్నాను’ అని త్రివేది బడ్జెట్ ప్రసంగంలో తెలియజేసారు. 2002-03 తర్వాత రైల్వే ప్రయాణికుల చార్జీలను పెంచడం ఇదే మొదటిసారి. పెంచిన చార్జీల ప్రకారం సబర్బన్, ఆర్డినరీ సెకండ్‌క్లాస్‌లో వంద కిలోమీటర్ల ప్రయాణానికి 2 రూపాయల మేర చార్జీ పెరుగుతుంది. స్లీపర్ క్లాస్‌లో 5 రూపాయలు, ఎసి చైర్‌కార్, త్రీటైర్‌లో 10, ఎసి టూటైర్‌లో 15 రూపాయలు, ఎసి మొదటి తరగతిలో 30 రూపాయలు పెరుగుతుంది. ప్రతిపాదిత పెంపు ప్రభావం చార్జీలపై స్వల్పంగానే ఉంటుందని త్రివేది చెప్తూ, గత ఎనిమిదేళ్లలో చమురు ధరల్లో పెరుగుదల ప్రభావాన్ని కూడా ఇది పూర్తిగా భర్తీ చేయడం లేదని చెప్పారు. అయితే త్రివేది తన బడ్జెట్‌లో భద్రతకు, ప్రయాణికుల సదుపాయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
కాగా, కొత్త రైళ్లను ప్రకటించిన మంత్రి త్రివేదీ.. నిధులను మాత్రం విదిలించలేదు. వందల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టులకు లక్షల్లో నిధులు కేటాయించారు. అరకొర కేటాయింపులు, మంజూరులతోనే సరిపెట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఈ ఏడాది కూడా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలనూ బుట్టదాఖలు చేశారు. కంటితుడుపు చర్యగా 24 కొత్త రైళ్లకు పచ్చజెండా ఊపారు. వీటిలో 22 ఎక్స్‌ప్రెస్, 2 పాసింజర్ రైళ్లు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌ల్లో 18 రాష్ట్రం నుంచి ప్రారంభమవుతుండగా, మిగతావి రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తాయి. మరో మూడు రైళ్లను పొడిగించగా, నాలుగు రైళ్ల రాకపోకలను పెంచారు. ఆరు కొత్త రైల్వే మార్గాల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యయాన్ని భరించాలని స్పష్టం చేశారు. రెండు కొత్త లైన్ల సర్వేలను, ఒక విద్యుదీకరణ సర్వేను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రణాళికా సంఘం పరిశీలనకు మరో 10 కొత్త లైన్లు, మూడు డబ్లింగ్ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది కేవలం ఒక డబ్లింగ్ ప్రాజెక్టును మాత్రమే మంజూరు చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఎసి ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా బుక్- ఎ- మీల్ పథకాన్ని ప్రవేశపెట్టడం, 200 రైళ్లలో బయో టాయిలెట్ల ఏర్పాటు, టికెట్ వెండింగ్ మిషన్లను ప్రవేశపెట్టడం లాంటి అంశాలను కూడా త్రివేది తన బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
అయితే ప్రయాణికుల చార్జీల పెంపుపై వివిధ రాజకీయ పక్షాలు వెంటనే తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. త్రివేది సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ సైతం రైలు చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. సామాన్య ప్రయాణికులపై భారం మోపుతున్న చార్జీల పెంపును ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని, పెంచిన చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని తమ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసిందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసారు. అయితే ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం త్రివేది రైల్వే బడ్జెట్‌ను మెచ్చుకుంటూ చార్జీలను స్వల్పంగా పెంచడం సరయిన దిశలో తీసుకున్న నిర్ణయమని అన్నారు. ‘రైల్వే మంత్రి తివేది ముందుచూపుతో కూడిన బడ్జెట్‌ను సమర్పించారు. భారతీయ రైల్వేల భద్రత, ఆధునీకరణకు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చింది’ అని ఆయన అన్నారు. పారిశ్రామిక వర్గాలు కూడా రైల్వే బడ్జెట్‌ను సమతౌల్యతతో కూడిన బడ్జెట్‌గా అభివర్ణించారు. దాదాపు పదేళ్ల తర్వాత చార్జీలను స్వల్పంగా పెంచడంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో కూడా పెద్దగా నిరసన వ్యక్తం కాకపోవడం గమనార్హం.