కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స బీజేపీలో చేరబోతున్నారా?

 

ఆ మధ్య ఎప్పుడో మాజీ పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఆ వార్తలను ఖండించలేదు. కానీ ఆ తరువాత జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవడంతో ఆయన పార్టీ మారకపోవచ్చని అందరు భావించారు. కానీ మళ్ళీ మరోమారు ఆయన బీజేపీలో చేరడంపై వార్తలు వస్తుండటం గమనిస్తే నిప్పు లేనిదే పొగ రాదు కదా! అనిపిస్తుంది.

 

ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపించిపోయిన బొత్స సత్యనారాయణ మొదటి నుండి రాష్ట్రం విడిపోయేవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పైగా రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పి.సి.సి.అధ్యక్ష పదవి నుండి కూడా తొలగించి ఆయన స్థానంలో రఘువీర రెడ్డిని కూర్చోబెట్టడంతో అంతకాలం ఒక వెలుగు వెలిగిన ఆయనకు పార్టీకి కూడా పనికిరానివాడయిపోయారు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో విజయనగరం జిల్లా ప్రజలు ఆయనతో సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా తిరస్కరించడంతో ఆయన రాజకీయ జీవితం ఆఖరు దశకు చేరినట్లయింది. కానీ ఆయన తన సుదీర్గ రాజకీయ ప్రయాణంలో ఇటువంటి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కనుక ఆయన రాజకీయ ఖాతాను అంత తేలికగా మూసివేయలేమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వారి అంచనాలను నిజం చేస్తున్నట్లుగా ఇప్పుడు ఈ వార్తలు వినిపిస్తున్నాయి.

 

వచ్చే ఎన్నికల నాటికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ దృష్టి కాపు సామాజిక వర్గం మీద పడింది. అంతకు ముందు బీజేపీలో చేరిన కావూరి సాంబశివరావు రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నేతలందరినీ బీజేపీలోకి రప్పించేందుకు తెరవెనుక గట్టిగా కృషిచేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. బహుశః ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించడం వలననేమో కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ చడీ చప్పుడు లేకుండా అకస్మాత్తుగా ఒకరోజు బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను, బీజేపీ అమలుచేస్తున్న ఈ ‘పంచవర్ష ప్రణాళిక’ను పరిగణనలోకి తీసుకొని చూసినట్లయితే, బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.

 

ఆయన ఆర్ధికంగా, రాజకీయంగా మంచి బలమున్న నాయకుడే కావచ్చును. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావచ్చును. కానీ ముఖ్యమంత్రి కావాలనే పదవీ లాలసతో  కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర విభజనకు ఆయనే ప్రోత్సహించారనే భావన ప్రజలలో బలంగా నాటుకొనిపోయుంది. కనుక ఒక్క విజయనగరం జిల్లాలోనే కాక రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలలో కూడా ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే సంగతి కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ వ్యతిరేకత ఎల్లకాలం అలాగే ఉండిపోదు గనుక బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకొన్నా ఆశ్చర్యం లేదు.

 

అదే జరిగితే ముందుగా విజయనగరం జిల్లాకే చెందిన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు, తెదేపాకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కనుక ఆయన తీవ్రంగా వ్యతిరేకించవచ్చును. కనుక బీజేపీ ఈ విషయంలో చాలా ఆచితూచి నిర్ణయం తీసుకొనవలసి ఉంటుంది. ఇక మరో విషయం ఏమిటంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలనుకొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏవిధంగా చూసుకొన్న బొత్సతో పోలిస్తే ప్రజలలో కిరణ్ కుమార్ రెడ్డికే మంచి పేరుంది. కనుక ఒకవేళ ఆయన పార్టీలో చేరెందుకు ఆసక్తి చూపిస్తే బొత్సకు బీజేపీలో ప్రవేశం దొరుకుతుందా లేదా? అనే విషయం తెలుసుకొనేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.