ప్రాణాలు తీస్తున్న బ్లూవేల్.. గేమ్ రూల్స్ ఇవే...

 

ఏదో సరదాకి ఆడుకునేది ఆట కానీ.. ఏకంగా ప్రాణాలు పణంగా పెట్టేదాన్ని ఆటని ఆట అనరు. ఈమధ్య ఆటలు అలానే తయారయ్యాయి. మొన్నటి వరకూ పొకోమెన్ గో అంటూ ప్రాణాలు తీసుకోగా.. ఇప్పుడు బ్లూ వేల్ అనే మాయదారి గేమ్ వల్ల ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. మన దేశంలో కూడా రోజు రోజుకి చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువవుతుంది తప్పా తగ్గట్లేదు. దీంతో ఈ గేమ్ పై చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం. గేమ్ కు సంబంధించిన లింక్స్ ను వెంటనే తొలగించాలంటూ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ, ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లకు నోటిసులు అందజేసింది. అసలు ఇంతకీ ఆ బ్లూవేల్ గేమ్ ఏంటీ.. గేమ్ చనిపోవడం ఏంటీ.. ఓసారి చూద్దాం..

 

బ్లూవేల్‌ చాలెంజ్ అంటే..?

 

బ్లూవేల్‌ చాలెంజ్‌ రష్యాలో 2013 లో ప్రారంభమైంది. ఫిలిప్‌ బుడెకిన్‌ అనే సైకాలజీ విద్యార్థి దీనిని సృష్టించాడు. ఈ గేమ్ వల్ల 2015లో మొదటి ఆత్మహత్య వెలుగుచూసింది.  ఆ తరువాత ఆత్మహత్యలు ఎక్కువవడంతో బ్లూవేల్‌ గేమ్‌ను సృష్టించినందుకు ఫిలిప్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. సైబీరియా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. మొదట రష్యాలో తర్వాత దుబాయ్‌లో అరాచకాన్ని కొనసాగించిన బ్లూవేల్‌ చాలెంజ్‌... తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చిలీ ఆఖరికి మన దేశంలోకి కూడా ప్రవేశించింది.

 

ఇక గేమ్ విషయానికి వస్తే 50 రోజులపాటు రోజుకో టాస్క్‌ (ఏదైనా పని) ఇచ్చి చేయమంటుంది. రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆడడం ప్రారంభించాక మొదట చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేసినట్లు రుజువుగా సంబంధిత టాస్క్‌ల ఫొటోలను గేమ్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకటి రెండు రోజులు అలవాటయ్యాక గేమ్‌ స్థానంలో మెంటార్‌ (అడ్మినిస్ట్రేటర్‌) ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మృత్యు క్రీడ ప్రారంభమవుతుంది! ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలని.. భయం గొలిపే హర్రర్‌ సినిమాలను చూడాలని.. చేతిపై బ్లేడుతో గానీ, కత్తితో గానీ ఏమైనా బొమ్మల ఆకారాలను గీయాలని.. అర్ధరాత్రి లేచి బిల్డింగ్‌పైకి వెళ్లాలని.. అక్కడే ఒంటరిగా కూర్చోవాలని.. ఇలా రకరకాల టాస్క్‌లు ఇస్తాడు. శరీరంపై సిరంజీలతో గుచ్చుకోమంటాడు. ఏదైన బ్రిడ్జిపై అంచున నిలబడి, సెల్ఫీ తీసి అప్‌లోడ్‌ చేయమంటాడు. సరదాగా నగ్నంగా ఫొటోలు తీసుకుని, షేర్‌ చేయాలని చెప్తాడు. ఇలా విచిత్రమైన టాస్క్ లతో ఈ గేమ్‌ పూర్తిగా హిప్నటైజ్‌ చేస్తుంది. ఇలా 49 రోజుల పాటు టాస్క్‌లు ఇచ్చి.. చివరి రోజున ఏదైనా బిల్డింగ్‌ పైనుంచి దూకాలని, వంతెనపై నుంచి నది నీటిలో దూకాలని ఆదేశిస్తాడు. అలాగైతేనే గేమ్‌ పూర్తయినట్లని చెప్పి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడు. ఇలా గేమ్ పూర్తవుతుంది.

 

మొత్తానికి అర్ధంలేని గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవడం.. కనీస జ్ఞానం కూడా లేకుండా గేమ్ రూల్స్ ను పాటించడం.. గేమ్ లో చెప్పాడని చనిపోవడం ఎంత వరకూ కరెక్టో ఆలోచించుకోవాలి.