ఎలాంటి మాస్టర్ ప్లాన్ లు లేవు.. కానీ కేసీఆర్ కుర్చీకి ఎసరు!!

 

తెలంగాణలో 2023 టార్గెట్ గా బీజేపీ ముందుకు వెళ్తున్నదని, వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కిషన్ రెడ్డి హైదరాబాద్ లో తొలిసారిగా మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. టీఆర్ఎస్ పై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వారు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. తాము ఎలాంటి మాస్టర్ ప్లాన్లు అమలు చేయడం లేదని, షెడ్యూల్ ప్రకారమే 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికల కోసం తామేమీ తొందరపడటం లేదని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2023లో బీజేపీ రావాలని కామన్ పబ్లిక్ కూడా చర్చించుకుంటున్నారు. ఆఫీసర్స్, యూత్, మహిళలు ఇలా ఎవర్ని తీసుకున్న అదే చర్చ. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అంటున్నారు. ఇది రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మార్పునకు సంకేతం” అని తెలిపారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీ సర్కార్’ అనే నినాదంతో ముందుకు పోయిందని ఆ నినాదం ఏమైందో అందరికీ తెలుసని ఎద్దేవా చేసారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు కేసీఆర్ సారు, కేటీఆర్ సారు.. ఇవేమి చూడరని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘త్రిపురలో ఒకప్పుడు మాకు ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారంలోకి వచ్చాం. దేశంలో చాలా రాష్ట్రాలలో ఇలా అధికారంలోకి వచ్చాం. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు తప్పకుండా మార్పు జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ మార్పు జరుగుతుంది." అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.