వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి.. బీజేపీ ఆఫర్!!

 

బీజేపీ, వైసీపీల మైత్రి బంధం బలపడుతోంది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై వైసీపీ తన అభిప్రాయాన్ని బీజేపీకి చెప్పాల్సి ఉంది. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్‌సభలో ఈ పదవిని అన్నాడీఎంకేకు కేటాయించారు. అన్నాడీఎంకేకు చెందిన తంబిదురై లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 

ఇప్పుడు వైసీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలనుకొంటున్నట్టుగా బీజేపీ నాయకత్వం వైసీపీకి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై వైసీపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదట. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలా వద్దా అనే కోణంలో వైసీపీ ఆలోచిస్తోంది. 

ఒక్కసారి బీజేపీ ఆఫర్ కి తలొగ్గితే.. ప్రత్యేక హోదాపై పూర్తిగా మౌనం వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని పరిస్థితిలో ఉన్న వైసీపీ.. ఇలా బీజేపీ ఆఫర్లకు ఓకే చెప్పి దగ్గరైతే హోదా టాపిక్ ని పూర్తిగా దూరం పెట్టేస్తుంది బీజేపీ. గతంలో టీడీపీ ప్రభుత్వానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దగ్గరై దూరమవ్వాల్సి వచ్చింది. మరి ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకవేళ ఈ పదవిని  తీసుకోవాల్సి వస్తే మాత్రం గిరిజనులకు ఈ పదవిని కట్టబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.