దానిపై కేంద్రం నిర్ణయమే తీసుకోలేదుట!
posted on Jun 23, 2015 9:23PM
.jpg)
నిన్న మొన్నటి వరకు ఓటుకి నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై రాజకీయపార్టీల నేతలు వాదోపవాదాలు చేసుకొన్నారు. ఇప్పుడు తాజాగా విభజన చట్టంలో సెక్షన్: 8 అమలుపై వాదోపవాదాలు మొదలుపెట్టారు. తెలంగాణాకు చెందిన కొందరు దానికి వ్యతిరేకంగా, ఆంధ్రాకి చెందిన నేతలు దానికి మద్దతుగా వాదోపవాదాలు చేసుకొంటూ మీడియాకు మంచి పని కల్పిస్తున్నారు. సెక్షన్: 8 అమలుచేస్తే మళ్ళీ మరో ఉద్యమం తప్పదని తెలంగాణా నేతలు హెచ్చరిస్తుంటే, చట్టంలో ఉన్న మిగిలిన అన్ని సెక్షన్లను అంగీకరించినవారు సెక్షన్: 8ని మాత్రం ఎందుకు అంగీకరించరు? తప్పనిసరిగా దానిని అమలుచేయవలసిందే అని ఆంధ్రా నేతలు వాదిస్తున్నారు. కొందరు తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలు రేపటి నుండి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు వగైరాలకు సిద్దమయిపోతున్నారు.
కానీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే సెక్షన్: 8 అమలు గురించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, బీజేపీని అప్రదిష్ట పాలుజేసేందుకే కొందరు రాజకీయనాయకులు పనిగట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ఈ వ్యవహారమంతా డిల్లీలో ఆడిటర్ జనరల్ ముకుల్ రోహాత్గీ కేంద్ర హోం శాఖకు చెప్పిన తరువాతనే రెండు తెలుగు రాష్ట్రాలలో దీనిపై చర్చ మొదలయింది తప్ప రాష్ట్రంలో ఎవరో సృష్టించడం వలన కాదని కిషన్ రెడ్డి మరిచిపోయినట్లున్నారు.