ఎంపీ కోసం స్పెషల్ ట్రైన్..ప్రయాణీకుల పాట్లు..!

సాధారణ ప్రయాణీకులు చాలి చాలని రైళ్లతో నానా అవస్థలు పడుతూ మాకు రైళ్లు పెంచండి బాబూ అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని రైల్వేశాఖ ఒకరి కోసం ప్రత్యేకంగా రైలునే నడిపింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హాకు సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌లోని బినా జిల్లాలో ఉన్న పూనమ్ భోపాల్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో వెళ్లాల్సి ఉంది. పూనమ్ ఆలస్యంగా రావడంతో ఆమె భోపాల్ వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. దీంతో రైల్వేశాఖ అధికారులు ఆమె కోసం ప్రత్యేకంగా రెండు బోగీలతో స్పెషల్ రైలును ఏర్పాటు చేశారు. అంతేనా ఆ రైలు భోపాల్ చేరేంత వరకు మార్గమధ్యంలో వెళుతున్న రైళ్లను నిలిపివేశారు. ఆమె భోపాల్ చేరుకుని వెంటనే విమానాశ్రయానికి వెళ్లి ముంబయి విమానాన్ని అందుకున్నారు. కేవలం ఒక ఎంపీ సరైన సమయానికి విమానం అందుకోవడం కోసం సాధారణ ప్రయాణికుల రైళ్లను నిలిపివేయడంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదంగా మారింది.