బీహార్ ఎన్నికలలో బీజేపీకే విజయావకాశాలు?

 

బీహార్ అసెంబ్లీకి ఈ నెల 12 నుండి ఐదు దశలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ప్రజలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం చాలా అధికంగా ఉంటుందని ముందే పసిగట్టిన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ మోడీని ఎదుర్కొనేందుకే జనతా పరివార్ ఏర్పాటు చేసుకొన్నారు. ఆ రెండు కూటములే కాక బీహార్ శాసనసభ ఎన్నికల బరిలో వామపక్ష కూటమి, ములాయం సింగ్ నేతృత్వంలో సమాజ్ వాదీ పార్టీ, బీహార్ లో కొత్తగా అడుగుపెట్టిన మజ్లీస్ పార్టీ, అనేక చిన్నాచితకా పార్టీలు, వందల మంది స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

 

వారిలో ములాయం సింగ్ జనతా పరివార్ నుండి ప్రస్తుతానికి వేరుపడినప్పటికీ ఎన్నికల తరువాత అవసరమయితే మళ్ళీ జనతా పరివార్ తో జతకట్టడానికి వెనుకాడరు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ములాయం సింగ్ ని దువ్వి తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కనుక ఎన్నికల తరువాత ఎవరికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటే వారికే ఆయన మద్దతు తెలుపవచ్చును. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మజ్లీస్ పార్టీ, వామపక్షాలు కూడా జనతా పరివార్ కే మద్దతు తెలుపవచ్చును. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ జనతా పరివార్ తోనే కలిసి సాగుతోంది కనుక దాని మద్దతు కూడా జనతా పరివార్ కే ఉంటుంది. కనుక ఈ ఎన్నికలలో ఎన్డీయే (బీజేపీ) కూటమి ఒకటీ ఒక్కవైపు, పొత్తులు పెట్టుకోకపోయినా మిగిలిన పార్టీలన్నీ మరొకవైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 

కానీ ఈ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్యే ప్రధానంగా జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఎన్డీయే, జనతా పరివార్ కూటములు రెండూ కూడా వారి పరిపాలన, సమర్ధత, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించే గట్టిగా ప్రచారం చేసుకొంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నాయి. బరిలో ఉన్న మిగిలిన పార్టీలన్నీ కూడా మోడీ, నితీష్ లనే లక్ష్యంగా చేసుకొని యుద్ధం చేస్తుండటంతో. ఈ ఎన్నికలలో వారిద్దరే ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు అర్ధమవుతోంది.

 

వారిరువురి ప్రభావంతో బాటు డబ్బు, మద్యం, కులమతాలు వంటి అనేక అంశాలు ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చును. ఈ మధ్య కాలంలో బీహార్ లో రెండు సర్వేలు నిర్వహించబడ్డాయి. ఒకటి జీ న్యూస్ నిర్వహించగా మరొకటి చంద్రగుప్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్, పాట్నా నిర్వహించింది.

 

జీ న్యూస్ సర్వేలో ఎన్డీయే కూటమి 147 సీట్లు, జనతా పరివార్ కూటమికి 64, ఇతరులు 32 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. మొత్తం 243 మంది సభ్యులుండే బీహార్ శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 117 మంది సభ్యుల మద్దతు ఉండాలి. కానీ ఎన్డీయే కూటమికి 147 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే చెపుతోంది. ఆ సర్వేలో పేర్కొన్న విధంగా ఎన్డీయే కూటమి 147 సీట్లు గెలుచుకోలేకపోయినా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమయిన 117 సీట్లను తప్పనిసరిగా గెలుచుకోవలసి ఉంటుంది. లేకుంటే మిగిలిన పార్టీలన్నీ జనతా పరివార్ కి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొంటాయి.

 

ఇక రెండో సర్వే ప్రకారం బీహార్ ప్రజలలో 80 శాతం మంది రాజకీయ పార్టీల నుండి డబ్బు తీసుకొని ఓట్లు వేయడం తప్పుకాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అంటే ఈ ఎన్నికలలో డబ్బు ఎంత కీలకమయినదో ముందే స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల వద్ద, నేతల వద్ద అది చాలా పుష్కలంగా ఉంది కనుక డబ్బు పంచడం వారికి పెద్ద సమస్య కాబోదు. కానీ డబ్బు పంచినా రాష్ట్రాభివృద్ధి, సుస్థిర పరిపాలన వంటి కొన్ని అంశాలకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది కనుక చుట్టూ తిరిగి మళ్ళీ మోడీ, నితీష్ కుమార్ వద్దకే వస్తాయి. వారిద్దరిలో ప్రజలు ఎవరికీ ఓటేయాలనుకొంటే వారి కూటమి అధికారంలోకి వస్తుంది. నవంబర్ 8వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. అంతవరకు అందరూ వేచి చూడవలసిందే.