ఆ కోరిక తీరకుండానే అకాల మరణం


నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన భూమా నాగిరెడ్డి...1964 జనవరి 8న కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లెలో జన్మించారు. కర్నూలు జిల్లాలో ఉన్న ఫ్యాక్షన్  రాజకీయాల కారణంగా భూమాను..... ఆయన తండ్రి బాలిరెడ్డి  ఆ ప్రాంతానికి దూరంగా ఉంచి చదివించారు. ప్లస్ 2 వరకు చెన్నైలో చదువుకున్న నాగిరెడ్డి..తర్వాత బెంగళూరులో ఎంబీబీఎస్‌లో చేరారు. అయితే తండ్రి హత్యతో భూమా నాగిరెడ్డి చదువు మానేసి స్వగ్రామానికి వచ్చేశారు.

 

1986లో నాటి రాష్ట్ర మంత్రి.. మేనమామ ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె శోభానాగిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత నాగిరెడ్డి సోదరుడు శేఖర్‌ రెడ్డి అకస్మిక మృతితో రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. 1992లో ఆళ్లగడ్డకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో నంద్యాల లోకసభ నియోజకవర్గానికి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ ఆయనను ఎంపిక చేయడంతో ఫ్యామస్‌ అయ్యారు. ఆ తర్వాత నాగిరెడ్డి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు.

 

2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన భూమా.. గంగుల ప్రతాప్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయంగా ఆయనకు అదే తొలి ఓటమి. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి...నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఏప్రిల్‌ 24 న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభ మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయారు. 20016లో భూమా నాగిరెడ్డి తన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

 

ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఎప్పటికైనా మంత్రి అవ్వాలనేది ఆయన కోరికని సన్నిహితులు చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో భూమాకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో ఆయన పలుమార్లు భేటీ కావడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. కానీ మంత్రి కావాలన్న కోరిక నెరవేరకుండానే మృతిచెందారు. క్షేత్రస్థాయి నేతలు.. కార్యకర్తలతో నేరుగా పరిచయం ఉన్న నాగిరెడ్డి.. తన వారి కోసం.. తన వర్గం కోసం ఎంతవరకైనా పోరాడుతారన్న పేరుంది.