మరోసారి ఆసుపత్రిలో చేరిన సౌరవ్‌ గంగూలీ

టీమిండియా మాజీ క్రికెటర్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబీకులు కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురైన గంగూలీ.. బుధవారం మధ్యాహ్నం మరోసారి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

 

కాగా, ఇటీవల గంగూలీకి గుండెపోటు రావడంతో డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 2న జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి స్వల్ప గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్ ఆసుపత్రికి తరలించారు. అదే రోజున ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారు. ఐదు రోజుల అనంతరం జనవరి 7న గంగూలీ వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన మూడు వారాల్లోనే మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ వార్త వినగానే క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.