బంగారు తల్లి ఆడపిల్లల కోసమా? రాజకీయ ప్రయోజనాల కోసమా?

 

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రూపొందించిన బంగారు తల్లి పధకానికి ముందుగా స్వపక్షంలోనే వ్యతిరేఖత ఎదురయింది. తప్పనిసరి పరిస్థితుల్లో దానిని అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి తనకు అనుకూలురయిన మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీ వేసారు. వేల కోట్లతో ముడిపడిన ఈ పధకం గురించి ఆ కమిటీ ఎటువంటి అధ్యయనం చేయకుండానే యదా తధంగా దానిని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సమయంలో సభలో కేవలం అధికార పక్ష సభ్యులు తప్ప ప్రతిపక్ష సభ్యులు ఎవరూ లేరు. ఇక ఆ బిల్లును వ్యతిరేఖిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, జానా రెడ్డి ఇద్దరూ కూడా ఆ బిల్లుకి ఆమోదం తెలిపే సమయంలో సభ నుంచి బయటకి వెళ్ళిపోవడం గమనిస్తే వారిరువురూ కూడా దానిని వ్యతిరేఖిస్తునట్లు అర్ధం అవుతుంది.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పధకం ఎన్నికలను, ఓట్లను ఉద్దేశించి పెట్టింది కాదని సభలో చెప్పుకోవలసి రావడమే ఆయన అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలియజేస్తోంది. ఇటీవల కాలంలో ఆయన ఇటువంటి సంక్షేమ పధకాలు చాలానే ప్రవేశపెట్టారు. అయితే, వాటి గురించి కనీసం తన మంత్రి వర్గ సహచరులకి సైతం తెలియకుండా జాగ్రత్తపడుతూ, ఆయన నేరుగా సభలలోనే వాటిని ప్రకటించడం గమనిస్తే, అవన్నీ కేవలం తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకొనేందుకు, రాజకీయ ప్రయోజనాలకోసం నిర్ధేశించబడినవేనని అర్ధం అవుతుంది. ఆయనకి నిజంగా ప్రజలకి మేలు చేయాలనే తలపు ఉండి ఉంటే వాటిని అంత రహస్యంగా ప్రకటించవలసిన అవసరం ఉండదు.

 

తన మంత్రివర్గాన్ని సైతం పరిగణనలోకి తీసుకోకుండా ఇటువంటి పధకాలను ప్రవేశపెట్టవలసిన ఆగత్యం ఏమిటని ఆలోచిస్తే వాటిని శాశ్విత ప్రాతిపాదికన అమలు చేయడం కష్టం గనుక, వాటిని మంత్రివర్గం తిరస్కరించే అవకాశం ఉందని, అందువల్లే ఆ పధకాలను ముఖ్యమంత్రి నేరుగా ప్రజలలో ప్రకటిస్తునట్లు అర్ధం అవుతోంది.

 

వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.200 పెన్షన్ ఇవ్వడానికే ప్రభుత్వం క్రిందా మీద పడుతున్నపుడు, రాష్ట్రంలో పుట్టిన ప్రతీ ఆడపిల్ల పేరునా రూ.2000 చొప్పున ప్రభుత్వం ఏవిధంగా జమా చేయగలదు?దానికి అవసరమయిన వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి దులిపి తీసుకువస్తుంది? అని ప్రశ్నించుకొంటే ఈ పధకంలో డొల్లతనం అర్ధం అవుతుంది. ఇంతవరకు ఉన్న పధకాలను సక్రమంగా అమలు చేయలేని ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ ఈ భారీ పధకం తలెకెత్తుకోవడం చూస్తే, దాని అమలు పట్ల చిత్తశుద్ధి లేదని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టినదేననని అర్ధం అవుతుంది. కనీసం రానున్న ఎన్నికల వరకయినా ఈ భారీ పధకాన్ని ఎలాగోఒకలాగ అమలు చేయాలన్నాకూడా ఆ భారం కూడా ప్రజల మీదే మోపక తప్పదు.

 

ఇక గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా లక్షలు కోట్లు వ్యయం అయ్యే జల యజ్ఞం ప్రాజెక్టులు ప్రకటించి ఆయన వ్యక్తిగతంగా, రాజకీయంగా లాభం పొందారు తప్ప నేటికీ అనేక ప్రాజెక్టులు నిధులు కొరతతో సగంలో నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి లక్షల కోట్లు ఖర్చుచేసిన అటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, మళ్ళీ ఇప్పుడీ కొత్త పధకాలు ప్రవేశపెట్టడం చూస్తే, వాటి అమలుపై చిత్తశుద్ధి కంటే, వాటివల్ల కలిగే రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి భావిస్తునట్లు అర్ధం అవుతోంది.

 

ఇటువంటి భారీ పధకాలను ప్రవేశపెట్టినపుడు సహజంగానే చాలా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆమె పేరు నమోదుతో మొదలయ్యే ఈ అవకతవకలు ఆమెచేతిలో లక్ష రూపాయలు పడేవరకు కూడా కొనసాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మరటువంటప్పుడు, డబ్బుతో ముడిపడిన ఈ పధకంలో లోటుపాట్లను, దానిని అమలు చేయడంలో ఎదురయ్యే సమస్యలను పూర్తిగా అధ్యయనం చేయకుండా హడావుడిగా ఎందుకు ప్రవేశపెట్టినట్లు? అని ఆలోచిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ‘ఎన్నికలలు’ కంటున్నారో అర్ధం అవుతుంది.

 

ఈ విధంగా ఆయన తన ప్రతిష్ట పెంచుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాలకోసం ఇటువంటి పధకాలను ప్రవేశపెట్టి ఆ భారాన్ని ప్రజలను మోయమనడం చాలా అనుచితం.