బాలినేని, జగన్ టామ్ అండ్ జెర్రీ ఆటకు ఫుల్ స్టాప్?!

వైసీపీలో బాలినేని ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనా? ఆయన వద్దనుకున్నారా? జగనే వద్దన్నారా అన్న విషయంలో సందేహాలు ఉంటే ఉండొచ్చు కానీ బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పడం మాత్రం ఖాయమైపోయింది. తాను వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్న విషయాన్ని స్వయంగా బాలినేనే తన అనుచరులకు చెప్పేశారు. దీంతో ఇహనో ఇప్పుడో ఆయన వైసీపీకి రాజీనామా చేయడం ఖాయం. అ

సలు వైసీపీలో బాలినేని గత మూడేళ్లుగా హాఫ్ రెబల్ గానే కొనసాగుతున్నారు. ఇటు బాలినేనికీ, అటు వైసీపీ అధినేతకూ కూడా పరస్పర అవసరాలు ఉన్నాయి. పైపెచ్చు ఇరువురూ బంధువులు కూడా. అయినా బాలినేనికి పొమ్మనకుండా పార్టీలో పొగపెట్టడం అన్నది గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ వస్తోంది. ఇది ఎప్పుడు మొదలైందంటే.. జగన్ తాను అధికారం చేపట్టిన తరువాత దాదాపు మూడేళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవినుంచి తొలగించారు. అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది బాలినేనిలో అసంతృప్తికి బీజం వేసింది.

అప్పటి నుంచీ  ఆయన పార్టీకి, పార్టీ అధినేత జగన్ కు పంటికింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అయితే జగన్ పొమ్మన్న ప్రతి సారీ బాలినేని చూరుపట్టుకు వెళాడారు. అలాగే బాలినేని పార్టీకి గుడ్ బై చెబుతానంటే అల్టిమేటం ఇచ్చిన ప్రతి సారీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగించారు. ఎందుకంటే బాలినేనికి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఇక బాలినేని ఎందుకు పార్టీని వదలకుండా వేళాడారంటే.. ఆయనను మరే రాజకీయ పార్టీ చేర్చుకునే అవకాశాలు లేవు. దీంతో బాలినేని జగన్ మధ్య ఇన్నేళ్లూ టామ్ అండ్ జెర్రీ ఆట సాగుతూనే వచ్చింది.

అయితే 2024 ఎన్నికలలో వైసీపీ, బాలినేని కూడా పరాజయం పాలవ్వడంతో ఇక ఒకరి అవసరం ఒకరికి లేకుండా పోయింది. మరో ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేకపోవడంతో బాలినేనికి వెంటనే రాజకీయ ఆశ్రయం దొరికి తీరాల్సిన పరిస్థితి కూడా లేకపోవడంతో ఆయన ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సమయం చూసుకుని జగన్ కు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ రోజుకో విమర్శ, పూటకో డిమాండ్ తో  ఉక్కిరిబిక్కిరి చేస్తు న్న బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో జగన్ కూడా హమ్మయ్యా అనుకునే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News