బాబ్రీ విధ్వంసం ఎందుకు జరిగింది? అసలు వివాదం ఏంటి?

బీజేపీ అగ్రనేతలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో....అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసింది. బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో పాటు 15మందిని కుట్రదారులుగా తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

 

1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. బాబ్రీమసీదు స్థలంలో రామాలయం నిర్మించాలని.... అయోధ్యకు కరసేవకులు ఇటుకలతో రావాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. భారీగా అయోధ్యకు తరలివచ్చిన కరసేవకులు డిసెంబరు 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు.  దీంతో ఎన్నడూ లేని విధంగా మతఘర్షణలు చెలరేగడంతో...3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 

 

అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం ఈనాటిది కాదు....కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతోంది. అసలు వివాదం...యూపీలోని అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలం గురించే. రాముడి పుట్టిన స్థలం...మసీదు నిర్మించిన స్థలం ఒక్కటేనంటారు. రామాలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారని హిందూవులంటుంటే....మసీదును కూల్చేసి ఆలయాన్ని నిర్మించారని ముస్లింలు వాదిస్తున్నారు. 

 

1989లో విశ్వహిందూ పరిషత్ నేతలు.. రామాలయ నిర్మాణం కోసం నడుం బిగించారు. మసీదు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాదిరాయి వేశారు. ఈ సమయంలోనే అప్పటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించినా...సఫలం కాలేదు. 1992లో అయోధ్యకు ఇటుకలతో తరలిరావాలంటూ బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన కరసేవకులు వేలాది మంది అయోధ్యకు వచ్చి....1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1993లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, అశోక్ సింఘాల్, గిరిజా కిషోర్, విష్ణు హరి దాల్మియా, సాధ్వి రితంభరపై సీబీఐ క్రిమినల్ కేసులను పెట్టింది. 

 

అప్పటి ప్రధానిగా పీవీ నరసింహరావు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌లు....కరసేవకులకు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం నియమించిన జస్టిస్‌ లిబర్హాన్ కమిషన్....అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీతో సహా పలువురి పేర్లను చేర్చింది. అంతేకాదు....బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందుగానే వ్యూహాన్ని రచించారని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. దీనికి బలం చేకూరేలా....బాబ్రీమసీదు కూల్చివేతలో అద్వానీ పాత్ర ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారిణి అంజుగుప్తా సాక్ష్యం చెప్పారు. అద్వానీతోపాటు సంఘ్ పరివార్‌కు చెందిన పలువురు నాయకులు కరసేవకుల ఎదుట ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేసి వారిని రెచ్చగొట్టారని వెల్లడించారు. అయితే 2003లో అద్వానీపై పెట్టిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవడంతో ఆ కేసు నుంచి అద్వానీ బయటపడ్డారు. 

 

బాబ్రీ మసీదు కూల్చివేతపై 18 ఏళ్ల విచారించిన రాయబరేలీ కోర్టు....అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి పాటు నిందితులందర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసు కొట్టివేసింది. దీన్ని అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో....అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు బీజేపీ నేతలను కుట్రదారులుగా తేల్చింది. కేసును మళ్లీ పునర్విచారించాలంటూ సుప్రీంకోర్టు సీబీఐను కోరింది.