అయోధ్య కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నెలలో విచారణ పూర్తి

 

అయోధ్య వివాదానికి త్వరలో తెరపడేలా ఉంది. రామ జన్మ భూమి వివాదంపై విచారణ పూర్తై త్వరలో తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో విచారణను 26వ రోజు కొనసాగించింది. అక్టోబరు 18 లోపు విచారణ పూర్తిచేస్తామని పేర్కొంది. ఈ కేసులో మధ్యవర్తిత్వం కొనసాగించాలని ఇరువర్గాలు భావిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపింది. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాలు చేయవచ్చని వెల్లడించింది. కమిటీకి పరిష్కారం దొరికినట్లయితే దాన్ని కోర్టు ముందుకు తీసుకురావచ్చని అభిప్రాయపడింది. ఎప్పటిలాగే మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులను గోప్యంగా కొనసాగించాలని సూచించింది. ఈ కమిటీతో పాటు కోర్టులో విచారణ సాగుతుందని తెలిపింది.
 
అక్టోబరు 18తో వాదనలు ముగుస్తాయని ధర్మాసనం పేర్కొంది. అదే రోజున విచారణ కూడా పూర్తి చేస్తామని వెల్లడించింది. అక్టోబరు 18నాటికి వాదనలను పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కోరారు. అదే రోజున కోర్టు తీర్పుని రిజర్వ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీజేఐ పదవీకాలం నవంబర్ 17తో ముగియనుండడంతో ఈ లోపే అయోధ్య వివాదంపై తీర్పు వెలువడే అవకాశం ఉంది.