అరబిందో ఫార్మశీ భూ ఆక్రమణ
posted on Apr 2, 2012 7:59AM
అరబిందో ఫార్మశీ దేశంలోని అతిపెద్ద ఫార్మశీ కంపెనీల్లో ఒకటి. కోట్లాది రూపాయల లాభాలను కంపెనీ ఆర్జిస్తోంది. అయినా ఎక్కడయినా ఖాళీగా ఉన్న భూమి కనిపిస్తే దానిపై కన్నేస్తోంది. ఈ కంపెనీ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం పంచాయితీలోని చిట్టెవలసలో 28 ఎకరాల భూమిని ఆక్రమించుకుంది. దీనిపై స్థానికులు ఎన్నోసార్లు రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఎక్కడైనా పేదలు చిన్న స్థలంలో గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను పీకేంత వరకు అధికారులు నిద్రపోరు. అలాంటిది అరబిందో ఫార్మశీ కంపెనీ ఏకంగా 28 ఎకరాల భూమిని కబ్జా చేస్తే అడిగే నాథుడే లేకపోయాడు. అయితే ఈ కంపెనీ భూమిని ఆక్రమించుకున్న 8 సంవత్సరాల తరువాత ఎందుకైనా మంచిదనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ స్థాయిలో పావులు కదిపి ఆ భూమిని ఎకరాకు రూ. 5.14 లక్షల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లుగా కాగితాలు పుట్టించుకుంది. నిజానికి ఇక్కడ ఎకరం సుమారు రూ. 40 లక్షల వరకు ఉంది. ఇంత విలువైన స్థలాన్ని రూ. 5.14 లక్షలకే కట్టబెట్టడాన్ని ఇటీవల కాగ్ తన నివేదికలో తప్పు పట్టింది.