పోసాని ఇంటిపై అర్థ‌రాత్రి రాళ్ల దాడి.. రెచ్చిపోయిన దుండ‌గులు..

అర్థ‌రాత్రి. 2 గంట‌ల స‌మ‌యం. అంతా సైలెన్స్‌. గ్రామ‌సింహాల ఘోంకారాలు త‌ప్పా మ‌రెలాంటి శ‌బ్ద‌మూ లేదు. అలాంటిది స‌డెన్‌గా ఓ అగంత‌కుల ముఠా పోసాని కృష్ణ‌ముర‌ళి ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మైంది. పోసానిని బండ‌బూతులు తిడుతూ.. ఆయ‌న ఇంటిపై రాళ్ల దాడి చేశారు. నానావీరంగం సృష్టించారు. దుండ‌గుల రాళ్ల దాడి, అరుపుల‌తో వాచ్‌మెన్ హ‌డ‌లిపోయారు. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడ‌లోని పోసాని ఇంటిపై అర్థ‌రాత్రి జ‌రిగిన దాడి తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. 

పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. పీకేను పోసాని ప్రెస్ క్ల‌బ్ వేదిక‌గా బండబూతులు తిట్ట‌డంతో జ‌న‌సైనికులు ఆరోజే ఆయ‌న‌పై దాడికి య‌త్నించారు. పోలీసుల అండ‌తో పోసాని బ‌య‌ట‌ప‌డ్డారు. ఇక మంగ‌ళ‌గిరి మీటింగ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం రెచ్చిపోయారు. త‌న‌పై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడితే.. తాట తీస్తాం, తోలు వ‌లుస్తాం, బ‌య‌ట‌కు లాక్కొచ్చి తంతాం.. అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే స్పూర్తిగా తీసుకున్నారో ఏమో.. పీకే చెప్పిన‌ట్టే చేశారు కొంద‌రు అగంత‌కులు. అర్థ‌రాత్రి పోసాని ఇంటి కొచ్చి.. నోటికొచ్చిన‌ట్టూ తిడుతూ.. రాళ్ల‌తో దాడి చేశారు. వాచ్‌మెన్.. ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వాచ్ మెన్ ఫిర్యాదుతో పోలీసులు స్పాట్‌కు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.

అయితే, పోసాని కృష్ణమురళి కుటుంబం కొన్ని నెలల క్రిత‌మే ఆ ఇల్లు ఖాళీ చేసి.. వేరే చోట నివాసం ఉంటోంది. ఆ విషయం తెలియని దుండగులు, పోసాని ఎల్లారెడ్డిగూడలోని ఇంట్లోనే ఉంటున్నారనుకుని దాడికి పాల్పడ్డారు. దాడి చేసింది ప‌వ‌న్ ఫ్యాన్స్ అని అనుమానిస్తున్నారు. 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu