క్యోటో కు బదులుగా నాగసాకీ

రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ పై అమెరికా అణుబాంబులు వేసి పెను విధ్వంసానికి కారణమైంది. 6 ఆగస్టు 1945న హిరోషిమాపై యురేనియం గన్ రకం బాంబును (లిటిల్ బాయ్) వేసింది. ఆగస్టు 9 న ప్లుటోనియమ్ ఇంప్లోజను రకం బాంబును (ఫ్యాట్ మ్యాన్) నాగసాకిపై వేసింది. ఈ బాంబుల దాడిలో మరణించిన వారి సంఖ్య లక్షల్లోనే.. మానవ చరిత్రలోనే మరిచిపోలేని సంఘటనలుగా మిగిలిపోయాయి. అయితే ముందుగా అనుకున్న ప్రకారం క్యోటో నగరంపై దాడి జరగాలి. కానీ, అది నాగసాకి నగరానికి ఎందుకు మారింది..అధ్యక్షుడిని ఒప్పించి ఈ నగరాన్ని లక్ష్యాల జాబితాలో చేర్చింది ఎవరూ..

 

అణుబాంబుల పై పరిశోధనలు మాత్రం మొదట జర్మనీలో ప్రారంమయ్యాయి. 1938 లో జర్మను కెమిస్టులు ఓట్టో హాన్, ఫ్రిట్జ్ స్ట్రాస్‌మన్‌లు అణువిచ్ఛిత్తిని కనిపెట్టడంతోనూ విజయం సాధించారు. లీస్ మీట్నర్, ఓట్టో ఫ్రిష్‌లు దానికి సైద్ధాంతిక వివరణ ఇవ్వడంతోనూ బాంబు తయారీ సాధ్యమైంది. అయితే  జర్మనీ ముందుగా అణుబాంబును తయారు చేస్తుందేమోనన్న భయంతో  1939 చివర్లో అమెరికాలో దీనిపై పరిశోధనలు మొదలయ్యాయి. 1941 లో బ్రిటిషు వారి మాడ్ కమిటీ నివేదిక వచ్చేదాకా పరిశోధనలు అంతంత మాత్రంగానే సాగాయి. బాంబు తయారీకి కోసం టన్నుల కొద్దీ సహజసిద్ధ యురేనియమ్ బదులు 5-10 కిలోల శుద్ధి చేసిన యురేనియమ్-235 సరిపోతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాత 1943 లో క్విబెక్ ఒప్పందం ప్రకారం యుకె, కెనడాల అణుకార్యక్రమాలు - ట్యూబ్ అల్లాయ్స్, మాంట్రియల్ లాబొరేటరీలు అమెరికా వారి మన్‌హట్టన్ ప్రాజెక్టులో విలీనమయ్యాయి. దాంతో  రాబర్ట్ జె ఓపెన్‌హీమర్ నేతృత్వంలో న్యూ మెక్సికోలోని లాస్ అల్మాస్ లేబొరేటరీ అణు బాంబు రూపకల్పనకు వేదికైంది.  మొదట రెండు రకాల బాంబులను తయారు చేసారు. మొదటిది, లిటిల్ బాయ్ - గన్ రకపు విచ్ఛిత్తి బాంబు (యురేనియమ్-235).] రెండవది, ఫ్యాట్‌మ్యాన్ - మరింత శక్తివంతమైన ఇంప్లోజన్ రకం బాంబు. జపాను వారు కూడా అణు బాంబు తయారీ ప్రారంభించారు. అయితే వారికి తగినన్ని ఆర్థిక, ఖనిజ వనరులు లేకపోవడంతో బాంబు తయారి సాధ్యం కాలేదు.  

 

జపాన్ పై విజయం సాధించాలన్న లక్ష్యంతో అణుబాంబు దాడులకు సిద్ధమైన అమెరికా ముందుగా దాడులు చేయడానికి కొన్ని నగరాలను సూచించమని వైమానికాధికారులు, సైనికాధికారులు, శాస్త్రవేత్తలతో ఒక కమిటీ వేసింది. బాంబు వేసేందుకు ఎన్నుకునే నగరం వ్యాసం 4.8 కి.మీ. కంటే ఎక్కువ ఉండాలి. బాంబు పేలుడు వలన కలిగే విధ్వంసం భారీగా ఉండాలి అన్న లక్ష్యంతో ఐదు నగరాలను ఎంపిక చేశారు. 

 

కోకురా: జపానులో అతిపెద్ద మందుగుండు సామాను తయారీ కేంద్రం

హిరోషిమా: ఓడరేవు కేంద్రం, పారిశ్రామిక కేంద్రం, పెద్ద సైనిక స్థావరం

యోకోహామా: విమానాల తయారీ, యంత్ర పరికరాలు, రేవులు, ఎలక్ట్రికల్ వస్తువులు చమురు శుద్ధి కేంద్రం వగైరాల కేంద్రం

నీగాటా: ఉక్కు, అల్యూమినియమ్ కర్మాగారాలు, రేవు, చమురు శుద్ధి కర్మాగారం, వగైరాల కేంద్రం

క్యోటో: పెద్ద పారిశ్రామిక కేంద్రం

 

ముందుగా కమిటీ తయారు చేసిన జాబితాలో నాగసాకి పేరు లేదు. అయితే క్యోటో నగరానికి ఉన్న చారిత్రిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత దృష్ట్యా ఈ నగరాన్ని జాబితా లోంచి తీసెయ్యాలని ఆర్మీ అధికారి హెన్రీ లూయిస్  స్టిమ్సన్ ఆర్మీ జనరల్ లూయిస్ ఆర్ గ్రోవ్స్‌కు సూచించాడు. కానీ దానికి ఉన్న సైనిక, పారిశ్రామిక ప్రాముఖ్యం కారణంగా ఆ నగరాన్ని జాబితాలో నుంచి తీసివేయడానికి గ్రోవ్స్ ఒప్పుకోలేదు. దాంతో  స్టిమ్సన్ అధ్యక్షుడు హారీ ట్రూమన్‌తో మాట్లాడి క్యోటోను లక్ష్యాల జాబితా నుండి తీసివేసేందుకు ఒప్పించాడు. క్యోటో స్థానంలో నాగసాకి పేరును సూచించాడు. యుద్ధనౌకా స్థావరం, నౌకా నిర్మాణ కేంద్రం, నౌకా దళానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసే కేంద్రం నాగసాకిలో ఉండటంతో భారీ  విధ్యంసమే జరుగుతుందని గ్రోవ్స్ ను ఒప్పించారు. చివరకు 9 ఆగస్టు 1945  ప్లుటోనియమ్ ఇంప్లోజను రకం బాంబును (ఫ్యాట్ మ్యాన్) నాగసాకిపై వేశారు. స్టిమ్సన్ చెప్పినట్టే జపాన్ కు అపారమైన ప్రాణ, ధన, సైనిక నష్టం జరిగింది. ఈ దాడి జరిగిన ఆరు రోజుల తరువాత లొంగిపోతున్నట్లు జపాన్ ప్రకటించడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ విధ్వంసం జరిగి 75 ఏండ్లు. ఆ రెండు నగరాల ప్రజలకే కాదు ప్రపంచం యావత్తు మరచిపోలేని దుర్ఘటనగా మిగిలింది.