రెండు నాలుకల ధోరణి!

 

నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ కార్యక్రమాన్ని గత కొన్న సంవత్సరాలుగా టీఆర్ఎస్ బహిష్కరిస్తూ వస్తోంది. ఆరోజును విద్రోహదినంగా, బ్లాక్ డేగా పాటించాలని పిలుపు ఇస్తోంది. టీఆర్ఎస్ కార్యాలయాల్లో నల్లజెండాలు ఎగురవేస్తూ హడావిడి చేస్తోంది. టీఆర్ఎస్ ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ అంతటా ముఖ్యంగా తెలంగాణ అంతటా ప్రతి ఏడాదీ అవతరణోత్సవాలు వైభవంగా జరుగుతూనే వున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన తర్వాత శుక్రవారం కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం తెలంగాణలో కూడా వైభవంగా జరిగింది. యథావిధిగానే టీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలు ఎగరేసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ చేసే దాడులకు భయపడి సామాన్య ప్రజలు సొంతగా ఆంధ్రప్రదేశ్ అవతరణ కార్యక్రమాలు తక్కువగా జరుపుకున్నప్పటికీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలలో మాత్రం ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ సమైక్యతకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ ప్రాంతంలోని కొందరు ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఈ వేడుకలలో పాల్గొనలేదు.

 

అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి సంగారెడ్డిలో ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన సంస్కారం చాలా వుంది. ‘ఆంధ్రప్రదేశ్’ అనే నీడలో అధికారాన్ని అనుభవిస్తూ అవతరణ వేడుకలలో పాల్గొనకపోవడం క్షమించరాని నేరం. కన్నతల్లినే మరచిపోయినవారిని ఏమనాలి? మొన్నామధ్య మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ ఆధ్వర్యంలో సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే సభ జరిగింది. ఆ సభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణకి ఎంతో అన్యాయం జరిగిందని అరుణమ్మ వాపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవంలో అన్ని దినపత్రికలలో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది.

 

ఆ ప్రకటనలలో సోనియా, మన్మోహన్, కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోతోపాటు సమాచార ప్రసార శాఖ మంత్రి డి.కె. అరుణ ఫొటో కూడా వుంది. ఆ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, తెలుగుజాతి ప్రగతికి నిలువెత్తు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ అనే మాటలు కూడా వున్నాయి. ఆ ప్రకటనలో మంత్రిగారు డి.కె.అరుణ ఫొటో కూడా వుంది కాబట్టి, ఆ ప్రకటనలో వున్న వాక్యాలతో ఆమె ఏకీభవిస్తున్నట్టే అర్థం. పేపర్లలో ఇచ్చే ప్రకటనలలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ని పొగుడుతారు. మిగతా అన్నిచోట్లా ఆంధ్రప్రదేశ్‌ని తిట్టిపోస్తారు. దీన్నే రెండు నాలుకల ధోరణి అంటారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu