వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిందే.. హరీష్ రావు
posted on Oct 1, 2015 3:12PM

తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాలలో భాగంగా ప్రభాకర్ రావు పోలీసు వ్యవస్థపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ బాలేదని.. పేకాటలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండిస్తూ ప్రభాకర్ రావు పోలీసులను అవమానపరుస్తూ వ్యాఖ్యానించారని అన్నారు. అంతేకాదు పేకాట క్లబ్ లు నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. క్లబ్‌లను మూయించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలీసు వ్యవస్థను కించపరిచే మాటలు మాట్లాడి వారి మనోభావాలు దెబ్బతీస్తున్నారని.. ఇలాంటి అవాంఛిత వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్ రావు పోలీసులకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి పోలీసులు మీకు భద్రత కల్పిస్తుంటే వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.