ఏపీకి ఒక్కచుక్క నీరివ్వం..
posted on Aug 20, 2015 11:19AM

ఏపీ నీటిపారుదల శాఖ కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖను కోరిన సంగతి తెలిసిందే. దీనికి తెలంగాణ నీటి పారుదల శాఖ నాగార్జున సాగర్ నుంచి కృష్ణాడెల్టాకు ఒక్కచుక్క కూడ తాగునీరు ఇవ్వలేమని.. ఈ నిల్వ ఉన్న నీటిలో ఏపీకి ఎలాంటి వాటా లేదని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పింది. అంతేకాదు ఏపీ శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేస్తేనే సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేస్తామని తిరకాసు పెట్టింది. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్ననేపథ్యంలో సెప్టెంబర్ రెండో వారంలోగా కృష్ణానదికి వరదలు వచ్చి శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లు నిండితేనే తప్ప రెండు రాష్ర్టాలకు నీటి కరువు తీరుతుందని.. లేదంటే, శ్రీశైలంలో 803 అడుగులకు దిగువన ఉన్న 17-18 టీఎంసీలు, సాగర్‌లో 509 అడుగులకు దిగువన ఉన్న 130 టీఎంసీల నీటిని ఇరు రాష్ర్టాలు వాడుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో తాగునీటి కోసం రెండు రిజర్వాయర్లను ఖాళీచేయడం తప్ప వేరే మార్గం లేదని రెండు రాష్ర్టాల నీటి పారుదల శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.