ఏపీలో లాక్ డౌన్? ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్ పై  కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ఏపీలో 2 వేల 5 వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. స్కూళ్లు, కాలేజీల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా భయపెడుతున్నా జనాల్లో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. మాస్కులు లేకుండానే రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. భౌతిక దూరం అన్న మాటే మర్చిపోయారు. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ తో.. థియేటర్ల దగ్గర రద్దీ కనిపిస్తోంది. బార్లు, పబ్బుల్లో విచ్చల విడిగా జనం నిబందనలను గాలికి వదిలేస్తున్నారు. 

కరోనా సెకెండ్ వేవ్ లో ఎలాంటి లక్షణాలు బయటపడకపోవడం మరింత ఆందోళన కల్గిస్తోంది. కరోనా సోకిన వారికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో యదేచ్ఛగా రోడ్లపై తిరేగేస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తుండటంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే లాక్ డౌన్ వార్తలపై క్లారిటీ ఇచ్చారు వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని. ఏపీలో కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అని.. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నామన్నారు. కోవిడ్ హాస్పిటళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్స్ సంఖ్య పెంచమని ఇప్పటికే అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అయితే లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.  

ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం‌, వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం చేయాలి అని కోరారు ఆళ్ల నాని.  ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా వ్యాక్సిన్ కొరత లేదన్నారు మంత్రి. ఏపీ వ్యాప్తంగా 3.80 లక్షల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్రానికి కొత్త ఇండెంట్ పంపించామని.. రెండు మూడు రోజుల్లో 2 లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసుల కేంద్ర నుంచి రానున్నాయని స్పష్టం చేశారు మంత్రి ఆళ్ల నాని.