వినమృతతో లేఖ రాసిన పీపీఏ.. అయినా లెక్క చేయని జగన్ సర్కార్!!

 

పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వాలంటే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో ఆర్కే జైన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  అయినా రివర్స్ టెండరింగ్ ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం బెట్టు వీడలేదు. అంతే దూకుడుగా ముందుకి వెళ్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్‌ చేయాలని భావిస్తోందని, దాన్ని మానుకోవాలని పీపీఏ సీఈఓ ఆర్కే జైన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘ఆగస్టు 13న పోలవరం ప్రాజెక్టు అత్యవసర సమావేశం జరిగింది. పోలవరం ప్రస్తుత కాంట్రాక్ట్‌ను ముందస్తుగా ముగించి, రీ టెండరింగ్‌కు వెళ్లే అంశంపై చర్చ జరిగింది. ఇప్పుడు అత్యవసరంగా పోలవరం కాంట్రాక్ట్‌ను రద్దు చేసి రీ టెండరింగ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు రీ టెండరింగ్‌కు వెళితే భవిష్యత్తులో ఊహించని పరిణామాలు ఎదరయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టుపై అనిశ్చితి ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయితే, దాని వల్ల లబ్ధిపొందే వారి మీద సామాజిక, ఆర్థికంగా కూడా ప్రభావం చూపుతుంది. వీటితోపాటు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. మన సమావేశానికి సంబంధించిన చర్చల సారాంశం నివేదిక మా ఆఫీసుకు మరికొన్ని రోజుల్లో వస్తుంది. మీ ఆఫీసుకు కూడా త్వరలో అందుతుంది. ఏదేమైనా.. మీకు మా వినమృపూర్వక సలహా ఏంటంటే.. పోలవరం కాంట్రాక్ట్‌ను రద్దు చేసి పనులు రీటెండరింగ్‌కు వెళ్లే ఆలోచనను మానుకోండి. దీనిపై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు కనీసం ప్రాజెక్టును ఎలా ఉన్నది అలాగే ఉంచండి.’ అని లేఖలో పేర్కొన్నారు.

రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వద్దంటూ పీపీఏ సూచన చేసినా.. దాన్ని ఖాతరు చేయకుండా రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 4,900 కోట్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్‌ను జలవనరుల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టింది. హెడ్ వర్క్‌లో మిగిలిపోయిన పనులకు రూ. 1800 కోట్లు, హైడల్ ప్రాజెక్టుకు రూ. 3,100 కోట్లకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది.