అలా నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. జగన్
posted on Sep 4, 2015 2:33PM

రోజూలాగే ఈరోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇరుపక్షాలు సభలో చర్చల కంటే ఒకరిమీద ఒకరు విమర్శలు.. వాదనలు చేసుకోవడమే ఎక్కువైంది. ఈ రోజు వైసీపీ నేతలు ఓటుకు నోటు కేసుపై స్పీకర్ కు తీర్మానం ఇవ్వడంతో ఇంకాస్త వేడి వాతావరణం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే జగన్ స్పీకర్ కు ఓటు నోటు కేసుపై తీర్మానం ఇచ్చారు.. దానిని స్పీకర్ కోడెల తిరస్కరించారు.. ఇంకేముంది దీంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఈ విషయంపై టీడీపీ నేత కూడా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి కేసీఆర్ చెబితేనే జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించారని.. కేసీఆర్ కు జగన్ ఫోన్ చేశారని.. మావద్ద ఆధారాలు ఉన్నాయని మండిపడ్డారు.
దీనికి జగన్.. తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఫోన్ చేసినట్లు నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని అన్నారు. ఓటుకు నోటు కేసుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తుండగా మైక్ కట్ చేసిన స్పీకర్.. ఫ్రశ్నోత్తరాలకు వెళదామని చెప్పటంతో మళ్లీ సభలో గందరగోళం చోటు చేసుకుంది.
ఈనేపథ్యంలో జగన్ చేసిన ఆరోపణలకు ఏపీ అధికార పార్టీ సభ్యులు సమాధానం చెపుతామని కోరడంతో స్పీకర్ వారికి మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ఎన్నో అవినీతి కేసులున్న జగన్ చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తనపై ఉన్న కేసులనుండి తప్పించుకునేందుకే కేసీఆర్ తో జగన్ చేతులు కలిపారంటూ జగన్ పై ధ్వజమెత్తారు. దీంతో నరేంద్ర చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు మళ్లీ నిరసలు చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.