ఆ కమిటీకి తెలంగాణాతో కూడా లింక్ ఉందిట

 

టీ-కాంగ్రెస్ మరియు తెరాస నేతలు తెలంగాణా ప్రక్రియకు అంటోనీ కమిటీకి ఎటువంటి సంభందం లేదని, అది కేవలం సీమంద్రా వాళ్ళ సమస్యలు వినేందుకు మాత్రమే ఏర్పాటయిన కమిటీ అని చెపుతుండగా, దిగ్విజయ్ సింగ్ ఈ రోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా విభజన నిర్ణయ ప్రక్రియకు, అంటోనీ కమిటికీ సంబంధం ఉందని స్పష్టం చేసారు. అంతేగాక దానికి నిర్దిష్ట వ్యవధి కూడా ఏమి లేదని బాంబు ప్రేల్చారు. అంటోనీ పార్లమెంటు సమావేశాలతో కొంచెం బిజీగా ఉన్నారని, అది పూర్తవగానే అంటే ఈ నెలాఖరున అంటోనీ కమిటీ హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రి సలహా మేరకు సీమంద్రా నేతలతో సమావేశం అవుతుందని ఆయన తెలిపారు.

 

అంటే, అంటోనీ కమిటీ పని ప్రారంభించడానికే ఇంకా ఇరవై రోజులపైనే వ్యవధి ఉందని తెలుస్తోంది. ఆ కమిటీ సీమంధ్రకు చెందిన వివిధ నేతలతో సమావేశాలు మొదలు పెట్టిన తరువాత అవి ఎంత కాలంలో ముగుస్తాయో తెలియదు. రాష్ట్ర విభజను వ్యతిరేఖిస్తున్న సీమంధ్ర నేతలు, వీలయినంత ఎక్కువ కాలం కాలయాపన చేసేందుకే ప్రయత్నం చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. వారి ధర్మ సందేహలన్నిటినీ విన్న తరువాత వారు లేవనెత్తిన సమస్యల గురించి చర్చించడానికి మళ్ళీ కేంద్ర మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీ నియామకం ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఆ సబ్ కమిటీ సీమంద్ర నేతలు నివేదించిన అన్ని సమస్యలకి ఆమోదయోగ్యమయిన పరిష్కారాలు కనుగొనవలసి ఉంటుంది. మళ్ళీ వాటిపై అంటోనీ కమిటీ సదరు సీమంధ్ర నేతలతో చర్చించి వారిని ఒప్పించడమో లేక వారికి కేవలం తమ నిర్ణయాలు తెలియజేసిన తరువాతనో, విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. ఈ ప్రకారం చూస్తే ఈ కమిటీ సమావేశాలు, పరిష్కారాలు, మళ్ళీ చర్చలు, సమావేశాలకే ఎంత లేదన్నా కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే, అంత వరకు రాష్ట్రంలో ఈ అనిశ్చితస్థితి తప్పకపోవచ్చును.

 

కేంద్రం తెలంగాణా ప్రకటన చేసే ముందుగానే ఈ ప్రక్రియ అంతా చేసి ఉండిఉంటే, నేడు రాష్ట్రం ఇంత అశాంతి ఉండేది కాదు. తెలంగాణా ప్రకటనకు ముందు కేవలం తెలంగాణా ప్రాంతంలో మాత్రమే అశాంతి నెలకొని ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంతా ఉద్రిక్త వాత్రవరణం, అరాచకం నెలకొని ఉంది. ఇందుకు కేంద్రాన్నే తప్పుపట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటన చేసేందుకు కేవలం తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొంది తప్ప, రాష్ట్రాన్ని రాష్ట్ర సమస్యలను లెక్కలోకి తీసుకోలేదని దీనివల్ల అర్ధం అవుతోంది. దీనికి రాష్ట్ర ప్రజలు భారీ మూల్యమే చెల్లిస్తున్నారిప్పుడు.