నిమ్మగడ్డ కేసులో మరోసారి జగన్ సర్కార్‌కు చుక్కెదురు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ సర్కార్ పంతం నెగ్గేలా కనిపించడంలేదు. నిమ్మగడ్డ కేసులో మరోసారి జగన్ సర్కార్‌కు చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉండకూడదని, కాబట్టి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను పునర్నియమించాలంటూ హైకోర్టు తీర్పు చెప్పినందున ఆ పదవి ఖాళీగా ఉన్నట్టు ఎలా అవుతుందని ప్రశ్నించింది. అంటే, పరోక్షంగా ఆ పదవిలో నిమ్మగడ్డ ఉన్నారు కదా అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం స్టే ఇవ్వాలని కోరగా, దాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.