రూ.500 కోట్లు కాజేసిన బాబు.. మందలగిరి పప్పుని మాత్రం కాను!!

 

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నేత అచ్చెన్నాయుడు ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నీటి బొట్టు లేకుండా, చిన్న మొక్క లేకుండానే నీరు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు రూ.18,000 కోట్లు దోచేశారని ఆరోపించారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.16 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.56,000 కోట్లకు తీసుకెళ్లిన ఘనచరిత్ర కూడా టీడీపీ నేతలదే అని దుయ్యబట్టారు. ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు రూ.500 కోట్లను కాజేశారని ఆరోపించారు. అందుకే ఏపీ ప్రజలు ఆ మూలన టీడీపీ నేతలను కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. అలీబాబా 40 దొంగల తరహాలో ఈ అలీబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనీ, దీంతో ఆ భగవంతుడు చివరికి టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చాడని ఎద్దేవా చేశారు.

'పోలవరంలో నిర్మాణ చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోలర్ ఆయనే. దొంగ ఆయనే. పోలీసూ ఆయనే. పగలు ప్రాజెక్టు కడతాడంట. మధ్యాహ్నం నుంచి క్వాలిటీ చెక్ చేస్తాడంట’ అని అనిల్ బాబుపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టును 3 నెలల్లో, 4 నెలల్లో పూర్తిచేయాలని అచ్చెన్నాయుడు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

దీనిపై అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి అనుభవం లేకపోయినా అదృష్టం కొద్దీ మంత్రి అయిన అనిల్ చంద్రబాబుకే ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

అచ్చెన్నాయుడు విమర్శలపై అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. ‘అధ్యక్షా.. నేను చంద్రబాబు కొడుకు లెక్కన నియోజకవర్గాన్ని పేరు పెట్టి కూడా పిలవలేక, మంగళగిరిని మందలగిరి అని చెప్పే పప్పును మాత్రం కాదు అధ్యక్షా. నేను డాక్టర్ ను. ఈ ఫీల్డ్ కు నేను కొత్త అయ్యుండొచ్చు. కానీ తొందరగానే నేర్చుకుంటాం. చంద్రబాబు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయ్యుండొచ్చు. మేం కాదనడం లేదు. కానీ ఆయన అడ్డగోలుగా దోచుకుని తింటూ ఉంటే, తప్పులు చేస్తుంటే యువనేతలు మాట్లాడకూడదు, రాజకీయాల్లోకి రాకూడదు అన్న రీతిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు అధ్యక్షా. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేక ఎమ్మెల్సీగా జాబ్ తీసుకున్న పప్పును మాత్రం నేను కాదు అధ్యక్షా’ అని విమర్శల వర్షం కురిపించారు.