ఉండవల్లి (టీ కప్పులో) తుఫాన్ రేపుతాడా?

సాధారణ రాజకీయ నాయకులకి తాము భిన్నం... అన్నట్టు వ్యవహరిస్తూ వుంటారు కొందరు పొలిటీషన్స్! ఏదో అల్లాటప్పా విమర్శలు కాకుండా గట్టి ఆరోపణలతో సంచలనాలు సృష్టిస్తుంటారు! కొన్ని రోజుల పాటూ సదరు మేధావులు మీడియాకి కావాల్సినంత 'ఫుడ్' పెడుతుంటారు!.
తరువాత ఏమవుతుంది? 
ఏముంది.... అంతా నార్మాల్! 


ఇంటలెక్చువల్ పొలిటీషన్ గారు ఇంటికి వెళ్లిపోతారు. మీడియా మరో అంశం వెదుక్కుని తన పని తాను చేసుకుపోతుంది. జనం కూడా లీడర్ గార్ని మర్చిపోతారు! ఇంత ఇంట్రో ఇప్పుడు ఎవరి కోసం అవసరమైందో తెలుసా? మన ఉండవల్లి గారి గురించే! వైఎస్ సీఎం అయ్యాక ఆయన ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడంలో అరుణ్ కుమార్ వారే మార్గదర్శి! ఏకంగా రామోజీ రావునే టార్గెట్ చేసి ముప్పతిప్పలు పెట్టాడు. కాని, చివరాఖరుకు రామోజీ తన సత్తా, తెలివితేటలు గట్టిగా చూపించి బయటపడ్డాడు! ఆయన స్థానంలో మరెవరైనా వుంటే అంతే సంగతులు అన్నట్టే వుండేది గ్రహచారం...


వైఎస్ బతికుండగా ఓ వెలుగు వెలిగిన ఉండవల్లి ఆ తరువాత మేధావులందరిలాగే సైలెంట్ అయ్యాడు. జగన్ వైపు వెళ్లిపోయి ఆవేశపడలేదు. అయితే, కాంగ్రెస్ లో వుంటూనే తెలంగాణ ఏర్పాటు సమయంలో నానా రచ్చా చేశాడు. ఓ సారి జై అంధ్రా అని, మరోసారి జై సమైక్యాంధ్ర అని గందరగోళం రేపాడు. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రెండు ప్రాంతాల్లో ఉండవల్లిని అయోమయంగా చూడటం మొదలుపెట్టారు జనం! రాష్ట్ర విభజన సమయంలో రాజమండ్రిలో సభ పెట్టి హడావిడి చేసిన అరుణ్ కుమార్ తరువాత అందరు కాంగ్రెస్ నేతల్లాగే ఎన్నికల్లో ఓడాడు. మరోసారి తనదైన స్టైల్లో సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు , ఇంత కాలానికి ఆయన కొత్త రాష్ట్రంలో మరోసారి విమర్శలు మొదలుపెట్టాడు! ఈ సారి టార్గెట్ యథాప్రకారం చంద్రబాబు అండ్ టీడీపీయే!


ఉండవల్లి కాంగ్రెస్ విడిచి వైఎస్ఆర్సీపి లోకి వస్తాడని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన తన కొత్త పార్టీ, కొత్త రోల్ రక్తి కట్టేలా ప్లాన్ చేసినట్టే కనిపిస్తోంది! ఆంధ్రుల కోసం కడుతోంది ఆమరావతి కాదు భ్రమరావతి అంటూ పంచ్ డైలాగ్ తో ఆరోపణలు గుప్పించేందుకు సిద్ధమయ్యాడు! రాజధాని నిర్మాణంలో గోల్ మాల్ జరుగుతోందని అందరూ చేసినట్టే విమర్శ చేయకుండా కాస్తా వెరైటీగా హడావిడి చేయటానికి పూనుకుంటున్నాడు. ఎలాగూ ఉండవల్లి లాంటి మేధావి కాబట్టి మీడియా కూడా ఆయన ప్రెస్ మీట్లకు బాగానే ప్రచారం కల్పిస్తుంది! ఇక తుఫానే అన్నమాట! 


ఉండవల్లి ఆరోపణలు చేసిన ప్రతీసారి తుఫాన్ రేగుతుంది. కాని, అది అంతలోనే టీ కప్పులో తుఫానుగా మిగిలిపోతుంది! ఈ సారి భ్రమరావతి తుఫాన్ ఎంత కాలం చెలరేగుతుందో చూడాలి...