సీఎం పేషీలో పేచీ.. అభీష్టసిద్ధికి ఆటంకం..

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వేగాన్ని అందుకోవడానికి ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇది అభినందించదగ్గ పరిణామం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పేషీలో సీఎం వేగాన్ని అందుకునే సమర్థులైన వ్యక్తులు వుండాలి. అప్పుడే ముఖ్యమంత్రి కార్యాలయానికి, ముఖ్యమంత్రికి మధ్య సరైన సమస్వయం కుదురుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్, తనకు సన్నిహిత మిత్రుడైన ‘అభీష్ట’ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేషీలో ఓఎస్‌డీగా నియమించారు. విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, అన్ని అంశాల మీద అవగాహనతోపాటు చురుకుదనం ఉన్న అభీష్ట ముఖ్యమంత్రి అభీష్టానికి తగ్గట్టుగా పనిచేయాలన్న దీక్ష, పట్టుదలతో బాధ్యతలు స్వీకరించారు. అయితే పాపం ఆయన అనుకున్నదొకటి.. సీఎం పేషీలో అయ్యిందొకటీ.

 

సహజంగానే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులుగా అనుభవంతో తల పండిపోయిన ఐఏఎస్ అధికారులు వుంటారు. ఇంకాస్త సహజంగానే వాళ్ళలో డాబూ, దర్పం గట్రాలు పుష్కలంగా వుంటాయి. ఈ బ్యూరోక్రాట్ల ధాటికి ఒక్కోసారి మంత్రులు, ఎమ్మెల్యేలే బెంబేలెత్తిపోతూ వుంటారు. అలాంటి ముదురు అధికారులను డీల్ చేయడం అభీష్టకి ఇబ్బందిగా మారిందట. చంద్రబాబు స్థాయి వేగాన్ని అందుకోవడానికి అభీష్ట చకచకా పనిచేస్తుంటే, అందుకు సహకరించాల్సిన ఐఏఎస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారట. అభీష్ట ఎక్స్‌ప్రెస్ స్పీడుకి అధికారుల ప్యాసింజర్ వేగానికి పొంతన కుదరటం లేదట. పైగా వాళ్ళందరూ పెద్దపెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కావడంతో మేమేంటి.. మా లెవలేంటి.. ఇతనెవరో కొత్తగా వచ్చిన వ్యక్తికి సహకరించడమేంటన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దాంతో వీరిమధ్య సమన్వయం కుదరక పనుల్లో చురుకుదనం మందగించిందట. అయితే తనపేషీ తన వేగానికి తగ్గట్టుగా పనిచేయకపోవడం గమనించిన సీఎం చంద్రబాబు ఓఎస్డీ హోదాలో వున్న అభీష్టకి క్లాసులు తీసుకుంటున్నారట.

 

అటు ఐఏఎస్ అధికారులు తనకు సహకరించరు.. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వాటీజ్ దిస్?’ అని సీరియస్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పేషీ ఓఎస్డీగా కొనసాగడం కంటే తనదారి తాను చూసుకుంటే మంచిదని భావించిన అభీష్ట ఓఎస్డీ పదవిని వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిపోవాలని అనుకున్నారట. ఆ విషయాన్ని తన మిత్రుడు లోకేష్ దగ్గర ప్రస్తావిస్తే, లోకేష్ అన్ని పరిస్థితులను ఎదుర్కొని నిలబడి గెలవాలంటూ అస్త్రసన్యాసం చేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు ఉపదేశం చేసి ఆయన రాజీనామా చేయకుండా ఆపారట. ఏది ఏమైనా అభీష్ట లాంటి చురుకైన వ్యక్తులు ఉత్సాహంగా పనిచేస్తున్నప్పుడు అలాంటి వారికి సహకరించాల్సిన బాధ్యత సీఎం పేషీలో వున్న బ్యూరోక్రాట్లకు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఏపీ సీఎం పేషీలో వున్న అధికారులు పేచీ పెట్టడం మానుకుంటే, మంచి పరిపాలన అందించాలన్న చంద్రబాబు అభీష్టం సిద్ధిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.