మరో ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడప్పుడు తలనరుక్కోవడం వంటి భీకర ప్రతిజ్ఞలు చేస్తుంటారు. కానీ అవసరమయితే మళ్ళీ వాటిని అంతే అలవోకగా తీసి గట్టున పెట్టగలరని దళితుడికి కేటాయించిన ముఖ్యమంత్రి సీటులో ఆయన కూర్చొని నిరూపించి చూపారు. తెలంగాణా సాధన కోసం అవసరమయితే తన తెరాసని కాంగ్రెస్ పార్టీలో కలిపేసేందుకు కూడా సిద్దమేనని ఒట్టువేసి, ఆనక పిల్లాజెల్లాను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి సోనియా గాంధితో గ్రూప్ ఫోటో కూడా దిగి వచ్చి, కాంగ్రెస్ పార్టీకి ‘హస్తం’ (హ్యాండ్) ఇచ్చేసారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నాలుగు స్తంభాలు పాతేసి ఊరూరా విద్యుత్ సరఫరా చేస్తామని అలవోకగా చెప్పారు. కానీ ఇప్పుడు ఓ మూడేళ్ళు ఓపిక పట్టమని అదే నోటితో జనాలకి చెపుతున్నారు.

 

జనాలు కాసేపు తమ సమస్యల నుండి కష్టాల నుండి బయటపడేందుకు సినిమాలకో, షికార్లకో వెళుతుంటారు. బహుశః అదే ఉద్దేశ్యంతోనేనేమో కేసీఆర్ కూడా జనాలకి తన కొత్త బంగారి లోకంలోకి తీసుకువెళ్ళి వారిని మరిపిస్తున్నట్లున్నారు. ఆ బంగారి లోకంలో ఓ హుస్సేన్ సాగర్...దాని చుట్టూ ఓ డజనో అరడజనొ పెట్రోనాస్ టవర్లు, ఓ ఇందిరా పార్క్....దాని పక్కనే ప్రపంచంలో కెల్లా ఎత్తయిన ఓ బిల్డింగ్, ఓ హైదరాబాద్...దానికి ఈకొస నుండి ఆకొస వరకు, హైవేలు, స్కైవేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు ఉంటాయి.

 

ఏడాదిలో రాష్ట్రమంతా అద్దంలా మెరిసిపోయే వెడల్పాటి తారు రోడ్లు, రెండేళ్ళలో నీళ్ళతో కళకళలాడే చెరువులు, మూడేళ్ళలో (కంటి రెప్పపడేంత సేపు కూడా అంతరాయం లేకుండా) నిరంతర విద్యుత్ సరఫరా, నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ స్వచ్చమయిన త్రాగునీళ్ళు ఇలా చాలా స్వీట్ డ్రీమ్స్ చూపిస్తున్నారు. ఆశయం గొప్పదయితే లోటు బడ్జెట్టుదేముంది చెట్టును దులిపినా డబ్బులు రాలుతాయి...తితిదేవస్థానాన్ని పిండినా రాలుతాయి. అయితే ఈ కొత్త బంగారి లోకం గురించి ప్రతిపక్షాలు జోకులు వేస్తుంటే, జనాలు కూడా లైట్ గా తీసుకొనే ప్రమాదం ఉందనో మారేమో తెలిదు గానీ, ఒకవేళ ఈ డ్రీం ల్యాండ్ నిర్మించలేకపోతే, వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగబోమని కేసీఆర్ మరో భీకర ప్రతిజ్ఞ చేసారు. అంటే దానర్ధం ఎన్నికలలో పోటీ చేయమని మాత్రం కాదు. పోటీ చేస్తారు కానీ ఓట్లు అడగరని భావించాల్సి ఉంటుంది.

 

అయితే ఇంతవరకు ఆయన ఇలాంటి ప్రతిజ్ఞలు చాలానే చేసారు. చాలానే గట్టున పెట్టారు కనుక దీని సంగతి ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చును. కనుక ఇప్పుడు అందరికీ వినబడేలా గట్టిగానే ప్రతిజ్ఞలు చేసుకోవచ్చును. (ఈ ప్రతిజ్ఞకు షరతులు వర్తిస్తాయి. ఇది కేవలం నీళ్ళ పదకానికి మాత్రమే వర్తిస్తుంది అని గమనించవలెను.)