పార్టీ అధ్యక్షుల సీమ?

 

రాయలేలిన సీమ, రతనాల సీమ మన రాయలసీమ. రాష్ట్ర రాజకీయ పటంలో సీమకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. అతి ఎక్కువ ముఖ్యమంత్రులను అందించిన ఘనత రాయలసీమదే. రాష్ట్ర విభజన నేపద్యంలో మరో రికార్డ్ సీమ మెడలో హారం కానుంది. సీమ ప్రాంతంలోని 4 జిల్లాలకు చెందిన వారే వివిధ రాజకీయ పార్టీల అద్యక్షులు, కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ పార్టీతో పెరిగిన అధ్యక్షులు మొత్తం 5 ప్రధాన పార్టీల అధ్యక్షులతో రాజకీయాల్లో కీలకం తామేనని నిరూపించుకున్నారు.

 

ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ పార్టీకి అధ్యక్షుడు కూడా కిరణే. కడప జిల్లాకు చెందిన జగన్ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అవశేష ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా రఘువీరారెడ్డి ఎంపిక కావడం అనంతపురం జిల్లాకో పార్టీ అధ్యక్షుల కోటా దక్కింది. కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిరక్షణ వేదిక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ్ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారే.