మంత్రి ఆనం శృంగేరి శారదాపీఠ సందర్శన!

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఉదయం శృంగేరీ చేరుకొన్నారు. మొట్టమొదట శృంగేరీలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని, ఇతర దేవతా సన్నిధులను దర్శించుకుని నరసింహవనంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఉభయ జగద్గురువులను దర్శించుకున్నారు. మొదట జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు.

తదనంతరం జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటగా దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించి రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలకు జగద్గురువుల మార్గదర్శకాలను, ఆశీరనుగ్రహాన్ని పొందటానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రార్థనాసందేశాన్ని కుడా విన్నవించటానికి తాము వచ్చినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు స్వామివారికి తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆశీస్సులు మార్గదర్శకత్వము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, ధర్మ బద్ధంగా ప్రజలకు మేలు కలిగేలా సత్పరిపాలన అందించటానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు. 2018వ సంవత్సరం మార్చి నెలలో తమ ఆంధ్రప్రదేశ్ విజయయాత్రలో భాగంగా విజయవాడలో ఉన్నప్పుడు అప్పుడు కుడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తమను సందర్శించినట్టు, తరువాత ముఖ్యమంత్రి గారిని ఆయన నివాసంలో తాము కుడా సందర్శించి ఆశీర్వదించినట్టు శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారు గుర్తు చేసుకున్నారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ ఐఏఎస్, శ్రీశైలం శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామి వారి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి డి.పెద్దిరాజు, తిరుమల వేదపాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, శ్రీశైలం దేవస్థాన వేదపండితులు గంటి రాధాకృష్ణమూర్తి తదితరులు ఈ సందర్భంగా జగద్గురువులను సందర్శించుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News