వైసీపీ నేతల నుంచి మీరే కాపాడాలి... గవర్నర్‌కు అమరావతి మహిళల మొర...
posted on Mar 3, 2020 2:04PM

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, 29 గ్రామాల ప్రజలు ఎక్కడికక్కడ తమ నిరసనలకు తెలియజేస్తున్నారు. అయితే, అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ మరోసారి ఏపీ గవర్నర్‌ను కలిసింది. రాజధానిలో జరుగుతున్న పరిణామాలు, అక్రమ కేసులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేసింది. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళలపై అక్రమ కేసులు నమోదు పెడుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ ఆవేదన వ్యక్తంచేసింది. శాంతియుతంగా తాము ధర్నాలు చేస్తుంటే... వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఎంపీ నందిగం సురేష్ తమపై తప్పుడు కేసులు పెట్టించి భయపెడుతున్నారని మహిళలు ఆరోపించారు.
ఇక, మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్న ఫొటోలను గవర్నర్ కు అందజేశారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై ఇప్పటివరకు 2వేల 800 అక్రమ కేసులు పెట్టారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ... తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.