స్టాలిన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..?

తమిళనాడులో ఏ పార్టీకి కూడా వరుసగా రెండోసారి పాలించే ఛాన్సివ్వరు అక్కడి ప్రజలు. 2011 ఎన్నికల్లో గెలుపొందిన అన్నాడీఎంకేని 2016లో గద్దె దించేస్తారని అంతా భావించారు. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌ కూడా అదే విషయాన్ని చెప్పాయ. అయితే అంచనాలను తలక్రిందులు చేస్తూ అమ్మ అధికారంలోకి రావడతో డీఎంకే నేతలు నీరసపడిపోయారు. ముఖ్యంగా కరుణానిధి ముద్దుల కొడుకు స్టాలిన్ ముఖంలో నెత్తురు చుక్క లేదు. అయితే జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్టాలిన్‌‌లో మళ్లీ ప్రాణం లేచొచ్చినట్లయ్యింది.

 

పన్నీర్ సెల్వం-శశికళ, పన్నీర్ సెల్వం-పళనిస్వామి మథ్య తెలెత్తిన విబేధాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఆయన వ్యూహాలు రచిస్తూ వచ్చారు. తాజాగా దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో మళ్లీ ఆయనలో ఆశలు చిగురించాయి. శశికళ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేసి బలపరీక్షలో నెగ్గాలన్న సీఎం పళనిస్వామి వ్యూహాన్ని తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలు 89 మంది చేత మూకుమ్మడి రాజీనామా చేయించాలని స్టాలిన్ పావులు కదుపుతున్నారు. డీఎంకేతో పాటుగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఒకరు, కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిదిమందితోనూ రాజీనామా చేయించాలని ఆయన యోచిస్తున్నారు.

 

తద్వారా రాష్ట్రపతి పాలన దిశగా నడిపించి..మధ్యంతర ఎన్నికలకు వెళ్లవచ్చని ఆయన భావన. అమ్మ మరణం తర్వాత అంతర్గత కుమ్మలాటలతో కొట్టుకుంటున్న అన్నాడీఎంకే ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని ఆ పార్టీ పట్ల అసంతృప్తి బయలుదేరి ఉన్న దృష్ట్యా మధ్యంతర ఎన్నికలు వస్తే విజయం తమదేనని స్టాలిన్ భావిస్తున్నారు. ఈ ధీమా కారణంగానే ఆయన ఇంతటి సాహసానికి దిగుతున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే స్పీకర్ తీసుకున్న అనర్హత నిర్ణయాన్ని సవాలు చేస్తూ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కింద ఆ పిటిషన్‌ను రేపు మద్రాస్ హైకోర్టు విచారించనుంది. దీంతో న్యాయస్థానం తీర్పును ఆధారంగా చేసుకుని స్టాలిన్ ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.