ఆదిలోనే నారాయణ రెడ్డికి అవరోధాలు

 

జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి త్వరలోనే తను పార్టీకి గుడ్ బై చెప్పేసి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి పార్టీ మారబోతున్నట్లు ప్రకటించారు. ఆయన తెదేపాలో చేరేందుకు సంసిద్దులవుతున్నారు. తెదేపా అధిష్టానం కూడా అందుకు సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కానీ ఆయన సోదరులలో ఇద్దరు అందుకు అభ్యంతరం చెపుతున్నట్లు తెలుస్తోంది. వారిని కూడా ఒప్పించి వారితో సహా అందరూ కలిసి తెదేపాలో చేరాలని ఆదినారాయణ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకి జమ్మలమడుగు తెదేపా ఇన్-ఛార్జ్ రామసుబ్బారెడ్డి నుండి అవరోధం ఎదురవుతోంది.

 

తమ చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన ఆదినారాయణ రెడ్డిని తెదేపాలో చేర్చుకోవడానికి రామసుబ్బారెడ్డి అభ్యంతరం చెపుతున్నారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసి ఆదినారాయణ రెడ్డిని తెదేపాలో చేర్చుకోవద్దని కోరారు. ఆయనను చేర్చుకొంటే జమ్మలమడుగులో తనకు రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. చిరకాలంగా పార్టీని నమ్ముకొని సేవలు చేస్తున్న తనకు అటువంటి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించవద్దని అయన లోకేష్ ని కోరారు. ఈవిషయం గురించి తన తండ్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడమని నారా లోకేష్ సూచించడంతో రామసుబ్బారెడ్డి ఆయనని కూడా కలిసి తన సమస్యని చెప్పుకోబోతున్నారు. కానీ ఒకవేళ ఆదినారాయణ రెడ్డిని, అతని సోదరులను పార్టీలోకి తీసుకోవడానికే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్లయితే అప్పుడు రామసుబ్బారెడ్డి పార్టీలోనే కొనసాగుతారో లేదో వేచి చూడాలి. వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి ద్వారా ఆదినారాయణ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన వాటికి చల్లబడి వైకాపాలోనే కొనసాగేందుకు సిద్దపడితే ఇక సమస్యే ఉండదు.