ఆది 'కేసు'లకు రాజంపేట దేశం టిక్కెట్?
posted on Mar 29, 2012 9:56AM
మాజీ ఎంపి డికె ఆదికేశవులునాయుడికి చిత్తూరు జిల్లాలో అంతమంచి పేరులేదు. ఆయన ఒక చిరు ఉద్యోగి స్థాయినుంచి కోట్లకు పడగెత్తిన తీరు జిల్లా వాసులందరికీ బాగా తెలుసు. ఎప్పుడూ తన స్వార్తంకోసమే పాటుపడే ఆదికేశవులునాయుడు ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అంతేకాక రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన వ్యవహారశైలి జిల్లాలో మరోసారి చర్చనీయాంశమైంది. డికె ఆదికేశవులు మొదట చిత్తూరు సమీపాన ఒక షుగర్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఇంజనీరుగా పనిచేశారు. తరువాత పొరుగునే ఉన్న ఒక డిష్టలరీలో చెరి చివరకు దానిని కొనే స్థాయికి ఎదిగారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులకు దగ్గరగా ఈ డిష్టలరీ సహాయంతో ఆయన మద్యం వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించారు.
తరువాత పివి నరసింహారావు హయాంలో ఆయనకు దగ్గరి ఒక ముడుపుల కేసులో కూడా ఇరుక్కున్నారు. ఆ కేసునుంచి బయటపడిన తరువాత టిడిపిలో చేరారు. అక్కడ కూడా ఇమడ లేక వైయస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టిటిడి బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరించారు. వైయస్ మరణాంతరం కిరణ్ కుమార్ రెడ్డి ఆదికేశవులు నాయుడును పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి. అసహనానికి లోనయ్యారు. ఆదికేశవులు నాయుడు బలిజ సామాజిక వర్గానికి చెందిన ధనవంతుడు. గతంలో ఆయన చంద్రబాబునాయుడుపై అనేక విమర్శలు గుప్పించారు. అయినా అవేవీ చంద్రబాబునాయుడు పట్టించుకోకుండా జిల్లాలో పార్టీ పటిష్టతకోసం ఆదికేశవులునాయుడుని ఆహ్వానిస్తున్నారు. అంతేకాక రాజంపేట లోక్ సభ టిక్కెట్ కూడా ఆయనకు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.