ఈఎస్ఐ స్కామ్ నేపథ్యంలో ఏసీబీ పంజా.. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న 151 కోట్ల ఈఎస్ఐ స్కామ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా స్ధాయి, ఏరియా అస్పత్రుల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.. ఈఎస్ఐ స్కామ్ లో భారీగా మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ నిర్దారించిన నేపథ్యంలో అవి ఎక్కడెక్కడికి చేరాయన్న దానిపై ఏసీబీ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచే పలు ఆస్పత్రులకు చేరుకున్న ఏసీబీ టీమ్ లు వివిధ విభాగాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ తరహాలో ఏపీలోనూ ఈఎస్ఐ స్కామ్ చోటుచేసుకున్న నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. విజిలెన్స్ విచారణలో బయటపడిన అక్రమాల నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోళ్లలో చేతివాటానికి సంబంధించిన వివరాలను ఏసీబీ రాబడుతున్నట్లు సమాచారం. విజిలెన్స్ నివేదికలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు కూడా ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆయన సిఫార్సుల ఆదారంగా ఏయే సంస్ధలు మందులను ప్రభుత్వానికి విక్రయించాయి, వాటిని ఎవరెవరికి పంపారు, వైద్య పరికరాలు ఏయే ఆస్పత్రులకు చేరాయన్న అంశాలను ఏసీబీ ఆరా తీసే అవకాశముంది.