ఆప్ ఎమ్మెల్యే మరో వివాదం...


ఆప్ పార్టీ నేతలు వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమి కాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకొంటూనే ఉంటారు ఆప్ పార్టీ నేతలు. నకిలీ డిగ్రీ పొందారనే ఆరోపణలపై న్యాయ శాఖ మాజీ మంత్రి జితేందర్‌ తోమర్‌ అరెస్ట్‌ కాగా, మరో మాజీ మంత్రి సోమనాథ్‌ భారతి గృహహింస కేసులో..  ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ హత్య, అత్యాచారం కేసులో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదా ఏకంగా 12 మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరో నేత వివాదంలో చిక్కుకున్నారు. ఆప్‌ ఎమ్మెల్యే సోమ్‌ దత్‌ కు ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చారనే కేసులో సమన్లు పంపింది. అక్టోబరు 13వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. కాగా దత్ అఫిడవిట్ లో.. ఆయన తల్లిదండ్రులు ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అలాగే ఆస్తుల వివరాలను పూర్తిగా ప్రకటించలేదన్న అభియోగాలు నమోదయ్యాయి.