కన్న కొడుకులే కాడెద్దులు! పాలమూరు రైతు కన్నీళ్ల సాగు  

రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని ప్రభుత్వాలు గొప్పగా చెబుతుంటాయి. సాగు సాఫీగా సాగేందుకు కొత్త కార్యక్రమాలు చేపట్టామని పాలకులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటిదేమి కనిపించదు. ఎప్పటిలానే అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడుతూ పంటలు పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన  ఓ పేద రైతు కన్నీళ్ల సాగు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కన్నకొడుకులనే కాడెద్దులుగా చేసుకున్నాడు. 

మహబూబ్‌నగర్ జిల్లా  దోరెపల్లి గ్రామంలో శివగారి పెద్ద రాములుది వ్యవసాయ కుటుంబం. ఆయనకు రెండున్నరెకరాల పొలం ఉంది. అరవై ఏండ్ల వయసులో కూడా ఆ రైతు వ్యవసాయం ఆపలేదు. తన ఇద్దరు కొడుకులతో కలిసి సాగు చేస్తున్నాడు. రోజూ పొలానికి వెళ్తూ పనుల్లో కొడుకలకు సాయం చేస్తుంటాడు ఆ వృద్ధ రైతు. అతడికి ఉన్న రెండున్నరెకరాల పొలంలో పదిసార్లు బోర్లు వేస్తే పదకొండోసారి నీళ్లు పడ్డాయి. అన్నిసార్లు బోర్లు వేయడంతో అప్పులు కూడా పెరిగిపోయాయి. దీంతో  ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. కూలీలను పిలిస్తే ఇచ్చేందుకు డబ్బులు లేక వాళ్లే పనులన్నీ చేసుకునేవారు. సాగు కోసం కాడెద్దులను కూడా కొనలేకపోయాడు.

వ్యవసాయానికి కాడెద్దులు వేరే వాళ్ల దగ్గర తెచ్చుకున్నా, అందుకు  ఇచ్చేందుకు డబ్బులు లేవు. అందుకే విధి లేక కొడుకుల్ని కాడెద్దులుగా చేసి గొర్రును లాగిస్తూ కరిగెట చేయిస్తున్నాడా రైతు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాములు  కష్టం చూసిన స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన భూమిని, వ్యవసాయాన్ని వదులుకోలేక సాగు చేస్తున్న రాములుకు ప్రభుత్వమే  సాయం చేయాలనుకుంటున్నారు.  నిరుపేద రైతులకు సర్కారే చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.
 

ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చడం లేదనడానికి ఈ  రైతు కష్టాలే నిలువెత్తు సాక్ష్యం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు  ఓ రైతు ట్రాక్టర్ కు కూలీ ఇచ్చే స్థోమత లేక తన కూతుళ్లతో అరక దున్నించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను చూసి సినీ నటుడు సోనూ‌సూద్ స్పందించిన వారికి ఆర్థికసాయం చేశాడు. ఈ పాలమూరు రైతుకు కూడా ఎవరో ఒకరు సాయం చేస్తారని ఆశిద్దాం..