తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ విలీనం

 

 

 

తెలంగాణ సాధన కోసమని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిన ఎంపీ వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ఇబ్బంది కలిగే ప్రకటన చేశారు. తెలంగాణ ఇస్తే తిరిగి కాంగ్రెస్ లో చేరతారా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వకుండా తెలంగాణ ఇస్తే తెరాసే కాంగ్రెస్ లో విలీనమవుతుందని పేర్కొన్నారు.


కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరినప్పటికీ వివేక్ ఆ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడం లేదు. ఆయనతో పాటు తెరాసలో చేరిన కేకే మాత్రం పార్టీలో చురుగ్గా ఉన్నారు. విభజన జరిగితే నక్సలిజం పెరుగుతుందంటూ సీఎం ఇచ్చిన నివేదికపై వివేక్ మండి పడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆయనపై నక్సల్స్ దాడి జరిగింది సీమాంధ్రలోనే అన్నారు. గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రుల ఆస్తులపై ఎలాంటి దాడులు జరగడం లేదన్నారు.


తెలంగాణపై ఎలాంటి ప్యాకేజీలకు తాము ఒప్పుకునేది లేదన్నారు. రాష్ట్రం తప్ప ఎవరూ ప్యాకేజీలు కోరుకోవడం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతంలోనే నక్సలిజం మొదలైందని తాను హోం మంత్రి షిండేకు చెప్పానన్నారు. నీరు, విద్యుత్ తదితర సమస్యలపై చట్టపరంగా వ్యవహరించవచ్చన్నారు.